పొరపాటైందని.. కేజ్రీవాల్ సవాల్, ఢిల్లీ అసెంబ్లీ పైన సిద్ధమని కిరణ్‌బేడీ
న్యూఢిల్లీ: ఈసారి తాము అధికారంలోకి వస్తే రాజీనామా చేయనని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోను కూడా తాను రాజీనామా చేయకూడదన్నదే తాను భారత రాజకీయాల నుండి నేర్చుకున్న తొలి పాఠమన్నారు. ఆయన ఓ ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్నారు.
గత ఏడాది రాజీనామా చేయడానికి ముందు ప్రజలను అడగాల్సి ఉండేదని చెప్పారు. తాము పొరపాటు చేశామని, తాము కూడా మనుషులమేనని, తాము పొరపాటు మాత్రమే చేశామని, నేరం చేయలేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కరెంట్ ఛార్జీలు తగ్గించినప్పుడు, ఏడు నెలల్లో బీజేపీ ఆ పని ఎందుకు చేయడం లేదన్నారు.
ఢిల్లీ బరిలో కృష్ణతీర్థ్!

బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణతీర్థ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆమె బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేయవచ్చునని అంటున్నారు.
కేజ్రీవాల్ వర్సెస్ కిరణ్ బేడీ
దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ మధ్య నువ్వా నేనా అన్నంత పోటీ ఉందని ఓ సర్వే వెల్లడించింది. ఏబీపీ న్యూస్ - నీల్సన్ నిర్వహించిన ఈ సర్వే కోసం ఈ నెల 17-19వ తేదీ వరకు 1489 మందిని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు 47 శాతం, బీజేపీలో చేరిన కిరణ్ బేడీకి 44 శాతం మద్దతు పలికారు.
మహిళల్లో దాదాపు యాభై శాదం మంది కేజ్రీవాల్‌ను, 41.4 శాతం కిరణ్ బేడీని బలపరిచారు. కిరణ్ బేడీ ఏఏపీల ఉంటే బాగుండేదని 44 శాతం మంది అభిప్రాయపడగా, బీజేపీలో చేరడమే మంచిదయిందని 33 శాతం అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, మరోసారి హంగ్ ఏర్పడనుందని వెల్లడైంది. ఏఏపీకి 31-35, బీజేపీకి 29-33 సీట్లు రావొచ్చని తేలింది.
కేజ్రీవాల్ సవాల్, సై అన్న కిరణ్ బేడీ
ఏఏపీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పలు అంశాల పైన కిరణ్ బేడీ బహిరంగ చర్చకు సిద్ధమా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. దానికి కిరణ్ బేడీ కూడా సై అన్నారు. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఫ్లోర్ పైన.. బహిరంగంగా డిబేడ్ పెడతామని ప్రతిసవాల్ చేశారు.












Click it and Unblock the Notifications