అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం...
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్..కేరళలోని శబరిమల ఆలయం మళ్లీ తెరుచుకుంది. డిసెంబర్ 27 వ తేది రాత్రి మూసివేసిన అయ్యప్ప ఆలయం మళ్లీ తెరుచుకుంది. మకరవిళక్కు మకరజ్యోతి ఉత్సవాల కోసం శబరిమల ఆలయం తెరుచుకుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి శబరిమలకు అయ్యప్ప భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. భక్తులను అదుపు చేయలేక ఒక దశలో వారిపై పోలీసులు లాఠీఛార్జీ చేసే పరిస్థితి కూడా ఎదురయ్యింది.
మండల పూజల అనంతరం మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయం భక్తుల దర్శనార్థం మకరజ్యోతి ఉత్సవాల కోసం మళ్లీ తెరుచుకుంది. 41 రోజులుగా జరుగుతున్న మండల పూజల సందర్భంగా శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ 41 రోజుల్లోనే రూ.241.71 కోట్ల ఆదాయం వచ్చిందంటే భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. జనవరి 13న ప్రసాద శుద్ధ క్రియ, 14 తేదీన బింబ శుద్ధ క్రియ నిర్వహించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వివరించింది.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ప్రధాన అర్చకుల సమయంలో ఆలయ ప్రధాన అర్చకుడు కందారు మహేశ్ మోహన్‌రావు ఆలయ తలుపులను తెరిచారు. జనవరి 15న మకరజ్యోతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా 13న ప్రసాద శుద్ధ, 14న బింబ శుద్ధ క్రియ నిర్వహిస్తామని ఆలయ నిర్వహణ అధికారులు వెల్లడించారు. మకరజ్యోతి అనంతరం జనవరి 20వరకు శబరిమల ఆలయం ద్వారాలు తెరిచే ఉంటాయని వివరించారు.
జనవరి 14,15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌లు..
మకరజ్యోతి సందర్భంగా వర్చువల్ క్యూలైన్ల టిక్కెట్ల జారీకి సంబంధించి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.శబరిమలను దర్శించే భక్తుల రద్దీని నివారించేందుకు జనవరి 14,15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌లను యాభై వేలకు తగ్గించనున్నట్లు ఆలయ అధ్యక్షుడు పీసీ ప్రశాంత్ వివరించారు. ముందస్తు బుకింగ్‌లను తీసివేసి ఈ రెండురోజుల్లో స్పాట్ బుకింగ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ స్పాట్ బుకింగ్‌లు కూడా పదివేలకు పరిమితం చేయనున్నట్లు పీసీ ప్రశాంత్ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఈ రెండు రోజుల్లో ఆలయానికి విచ్చేసే భక్తులు నేరుగా పంబకు వెళ్లాల్సిన అవసరం లేదు. నిలక్కల్‌లో స్పాట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును అధికారులు భక్తుల కోసం కల్పించారు.












Click it and Unblock the Notifications