హై డ్రామా: పోయెస్ గార్డెన్‌కు పన్నీర్, సరేనన్న శశికళ
అన్నాడింయకె ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే విషయంలో హై డ్రామా నడిచింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం కాపీతో పన్నీర్ సెల్వం శశికళ వద్దకు వెళ్లి సరేనని అనిపించారు.
చెన్నై: చిన్నమ్మ శశికళను అన్నాడియంకె ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునే విషయంలో హై డ్రామా నడిచింది. పార్టీ రెండుగా చీలిపోతుందని భావించిన తరుణంలో ఏకతాటిపైన నిలిచి ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు. చిన్నమ్మను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ తీర్మానాన్ని కూడా ఆయనే ప్రతిపాదించడం విశేషం.
తీర్మానం చేసిన తర్వాత ఆ ప్రతితో పన్నీర్ సెల్వం, సీనియర్ నేతలు పోయెస్ గార్డెన్‌కు వెళ్లి శశికళను కలిశారు. సభ్యుల కోరిక మేరకు ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టేందుకు ఆమె అంగీకరించారు. సర్వసభ్య సమావేశం తీర్మానం కాపీపై ఆమె సంతకం చేసారు. శశికళ సంతకం చేసిన కాపీతో పన్నీర్ సెల్వం, ఇతర సీనియర్ నేతలు సర్వసభ్య సమావేశానికి వచ్చారు.

అన్నాడియంకె సర్వసభ్య సమావేశం నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీలో చిన్నమ్మకు వ్యతిరేకత ఎదురవుతోందనే వార్తలు ఆ ఉత్కంఠకు కారణం. కానీ, అనూహ్యంగా పార్టీ ఏకతాటిపై నిలిచింది. దారి పొడవునా జయలలిత, శశికళ ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి.
సమావేశం హాల్‌లోకి సభ్యులను అనుమతించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2,200 మంది సభ్యులు సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎప్పుడూ జయలలిత కూర్చునే కుర్చీపై ఆమె చిత్రపటాన్ని ఉంచారు. పార్టీకి ఆమెనే సుప్రీం అనే సంకేతాలను ఆ విధంగా ఇచ్చారు.












Click it and Unblock the Notifications