జయ కాళ్లు తీసేశారు: ట్రాఫిక్ రామస్వామి, ‘వేదనిలయం’లో వాటా అంటూ దీప
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి ఆమె సన్నిహితురాలు శశికళే కారణమని ట్రాఫిక్ రామస్వామి ఆరోపించారు. ఈ విషయంపై మద్రాసు హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి ఆమె సన్నిహితురాలు శశికళే కారణమని ట్రాఫిక్ రామస్వామి ఆరోపించారు. ఈ విషయంపై మద్రాసు హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత చికిత్స కోసం ఆమె రెండు కాళ్లు తీసేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రితోపాటు శశికళ కూడా దాచి పెట్టారని అన్నారు.
శశికళను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ట్రాఫిక్ రామస్వామి ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు. ఆయన తన ఒంటికి పత్రాలను అంటించుకుని దీక్షను కొనసాగిస్తున్నారు. గతంలో జయలలితకు షుగర్ కారణంగా కాలి వేళ్లు తీసేశారని, ఇప్పుడు కాళ్లు కూడా తీసేశారని చెప్పారు.
జయలలిత పోస్టుమార్టం రిపోర్టును బయటపెట్టాలని రామస్వామి డిమాండ్ చేశారు. మన్నార్ గుడి మాఫియాపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయ కాళ్లు తొలగించిన విషయాన్ని శశికళ ఎందుకు దాచారో చెప్పాలన్నారు. శశికళ అరెస్ట్ ఖాయమని చెప్పారు.

'వేదనిలయం'లో నాకూ వాటా: జయ మేనకోడలు దీప
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని 'వేద నిలయం'లో తనకూ భాగముందని జయ మేనకోడలు దీప పేర్కొన్నారు. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మేనత్త జయలలితకు అత్యాధునిక, ఉన్నతమైన వైద్య చికిత్సలు అందించినట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయని, అయితే వాటి వివరాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.
పోయెస్‌గార్డెన్‌లోని ఇల్లు తమ నానమ్మ పేరుతో ఉందని, అందులో తనకూ భాగముందని చెప్పారు. రాజకీయ రంగం సవాలుతో కూడుకున్నదన్న విషయం తనకు తెలుసునని అయితే ప్రజాస్వామ్యంపై ఎనలేని నమ్మకం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications