Bihar Election 2025: ఈసీ ఒక్క నిర్ణయంతో బీహార్లో 2 కోట్ల మంది ఓటర్లకు షాక్ ?
బీహార్ లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న ఎన్డీయే కూటమి ఇప్పుడు హిందీ బెల్ట్ లో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ లో అధికారం నిలబెట్టుకుంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. దీంతో ఇండియా కూటమి కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈసీ తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా రాష్ట్రంలో 2 కోట్ల మంది ఓట్లు గల్లంతయ్యేలా ఉన్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ చేపట్టింది. ఇందులో భాగంగా స్థానికంగా ఉండని ఓట్లను తొలగించడంతో పాటు వలసదారులకు షాకులిస్తోంది. ఈసీ బీహార్ ఓటర్ల జాబితా సవరణ కోసం చేపడుతున్న చర్యలతో రాష్ట్రంలో ఏకంగా 2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఇండియా కూటమి అంచనా వేస్తోంది. ఇదే అంశంపై ఈసీతో సమావేశమైన ఇండియా కూటమి నేతలు సంచలన ఆరోపణలు చేశారు.

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన ఓటర్ల జాబితాల సవరణపై తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన 11 పార్టీల నేతలు ఈసీని కలిశారు. 2016లో ప్రధాని మోడీ చేపట్టిన నోట్ల రద్దు తరహాలోనే బీహార్ లో ఓట్ల రద్దు ఉందని వారు ఆరోపించారు. బీహార్ జనాభాలో కనీసం 20 శాతం మంది వలస కార్మికులు ఉన్నారని, ఈసీ చర్యలతో ఇప్పుడు వారంతా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని తెలిపారు.
2003లో జరిగిన చివరి ఓటర్ల జాబితాల సవరణ తర్వాత నాలుగు ఎన్నికలు జరిగాయని, అవన్నీ లోపభూయిష్టమేనా అని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఈసీతో భేటీ అనంతరం ప్రశ్నించారు. ఎనిమిది కోట్ల మందికి పైగా ఓటర్లున్న బీహార్లో ఓటర్ల జాబితాల సవరణ ఎన్నికలకు రెండు నెలల ముందు జరగడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే గతంలో ఓటరు గుర్తింపును నిర్ధారించేందుకు వాడిన ఆధార్ ను ఈసారి ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఓటరు జాబితాల సవరణపై రాజకీయ పార్టీలకు ముందుగా చెప్పకపోవడం కూడా తప్పేనన్నారు.

అయితే ఈ విమర్శలపై ఈసీ స్పందిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950, జూన్ 24న జారీ చేసిన సూచనల ప్రకారం ఈ ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్నట్లు తెలిపింది. విపక్షాలు లేవనెత్తిన అన్ని ప్రశ్నల్ని పరిష్కరించినట్లు పేర్కొంది. అయితే ఈ భేటీకి విపక్షాలకు చెందిన పలువురు నేతల్ని అనుమతించకపోవడాన్ని ఈసీ సమర్ధించుకుంది. అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రతి పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధుల్ని అనుమతించినట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications