పాక్ కట్టడికి వ్యూహం: 'హోదా'తో షాకిచ్చేందుకు సిద్ధం, దాడి సాధ్యమా?
న్యూఢిల్లీ: యూరి ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను కట్టడి చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ఆలోచన చేస్తోంది. యూరి దాడి నేపథ్యంలో పాక్ పైన కేంద్రం కఠిన వైఖరి అవలంభిస్తోంది.
పాకిస్థాన్‌ను కట్టడి చేసే దిశగా కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. కేంద్రం 1996లో పాకిస్థాన్‌కు అత్యంత ప్రాధాన్య హోదా ప్రకటించింది. పాకిస్థాన్‌కు ఇచ్చిన ఈ హోదాపై పునఃసమీక్షించాలని నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకు గురువారం అధికారులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.

దెబ్బకు దెబ్బ తీయాల్సిందే కానీ.. భావోద్వేగాలు వేరు
అదే సమయంలో పాకిస్తాన్ విషయంలో ఏం చేసినా ఆచితూచి, జాగ్రత్తగా చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్‌కు గుణపాఠం చెప్పాల్సిందేనని, దెబ్బకు దెబ్బతీయాల్సిందేనని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే భావోద్వేగాలు వేరు, క్షేత్రస్థాయి వాస్తవాలు వేరు అంటున్నారు.

ప్రస్తుతానికి యుద్ధం పరిస్థితి లేదు
పాకిస్థాన్‌తో అంత సునాయాసంగా యుద్ధానికి దిగే పరిస్థితే లేదని అంటున్నారు. పాకిస్థానీ ఉగ్రవాద విషనాగులు మన పార్లమెంటు మీద దాడికి తెగబడ్డప్పుడే వాజ్‌పేయి ప్రభుత్వం యుద్ధం చేసి ఉండేదని,అప్పట్లో 'ఆపరేషన్ పరాక్రమ్' పేరిట సరిహద్దుల్లో పెద్దయెత్తున సైన్యాన్ని 11 నెలలపాటు మోహరించారని, అమెరికా ఒత్తిడితో సైన్యాన్ని ఉపసంహరించారని గుర్తు చేస్తున్నారు.

ఆనాడు యుద్ధం చర్చ
ముంబైలో 'నవంబర్ 26' ఉగ్రదాడి సమయంలోను పాకిస్తాన్ పైన యుద్ధానికి దిగడం వల్ల మనకే నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు. పాక్‌పై దాడికి దిగితే ఆ దేశానికి ఒనగూడే నష్టం కన్నా, భారత్‌కు కలిగే నష్టమే ఎక్కువని తేల్చారు. యుద్ధం వల్ల ఆర్థిక రథానికి అడ్డంకులు ఏర్పడతాయని అంటున్నారు.

సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత
భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేయబోతోంది. ఈ మేరకు అత్యున్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించనుంది. సరిహద్దుల్లో భద్రతను పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, నదులు ఉన్నచోట గస్తీ పెంచాలని సూచించింది. కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి మధుకర్ గుప్తా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ ఏడాది జనవరిలో పఠాన్‌కోట్ పైన దాడి నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications