కేంద్రం ఆంక్షలు, విమానాలు రద్దు - ఆ ఏయిర్ పోర్టుల మూసివేత..!!
ఆపరేషన్ సింధూర్ వేళ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాక్ తో పాటుగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేల మట్టం చేయటంతో పాటుగా ఉగ్రవాదులను మట్టు బెట్టింది. ఇదే సమయంలో భారత్ లో పాక్ దాడులకు దిగే అవకాశం ఉందనే అలర్ట్స్ తో కేంద్రం అప్రమత్తం అయింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతోంది. ఇటు గగనతలంలోనూ భారత్ కొంత మేర విధించిన ఆంక్షలతో.. విమాన సర్వీసుల పైన ప్రభావం పడింది.
ఆపరేషన్ సింధూర, తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంత మేర కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. మే 10వ తేదీ వరకు 165కు పైగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అమృత్ సర్, ధర్మశాల, గ్వాలియర్, జమ్ము, బికనీర్, చండీఘడ్, లేహ్, కిషన్ గడ్, శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాల నుంచి మే 10వ తేదీ వరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి రీ షెడ్యూల్ లేదా క్యాన్సిల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ఇక, దేశ వ్యాప్తంగా 18 విమానాశ్రయాలను కేంద్రం మూసివేసింది. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమృత్ సర్, లేహ్, శ్రీనగర్, చండీ ఘడ్ తో సహా మొత్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకు న్నారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని 'ఆపరేషన్ సిందూర్' నిర్వహించారు. దీని కారణంగా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ గగనతలంలో ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, విమాన ప్రయాణీకులు తాము వెళ్లాల్సిన విమానాల సర్వీసుల గురించి ముందస్తు సమాచారంతో నిర్ణయం తీసుకోవాలని విమాన సంస్థలు సూచిస్తున్నాయి.
మరో వైపు ఎయిర్ ఇండియా మే 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ నగరాలకు తమ అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. అమృత్‌సర్‌కు వెళ్లాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించినట్లు తెలిపింది. అధికారులు తదుపరి అప్‌డేట్‌లు అందించే వరకు ఈ రద్దు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications