మరోసారి సంపూర్ణ లాక్ డౌన్.. సోషల్ మీడియాలో బిగ్ బాంబ్.. వాస్తవమేనా..?
దేశంలో కరోనా కేసులు,మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలల లాక్ డౌన్ సత్ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పేరుతో ఇచ్చిన సడలింపులన్నీ కేసుల పెరుగుదలకు దారితీశాయి. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై,ఢిల్లీ,చెన్నై,హైదరాబాద్ తదితర నగరాల్లో కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటం అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ అవసరం ఉందన్న అభిప్రాయాలు,చర్చలు జరుగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించనుందని సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత.. ప్రభుత్వం నిజంగానే మరోసారి సంపూర్ణ లాక్ డౌన్‌కి సిద్దపడుతోందా..
మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ నిజమేనా..?
'జూన్ 15 తర్వాత దేశంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంకేతాలు ఇచ్చింది. కాబట్టి మరోసారి రైళ్లు,విమాన సర్వీసులు పూర్తిగా రద్దు కానున్నాయి.' అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. దీంతో చాలామందిలో గందరగోళం మొదలైంది. అయితే ఇది పూర్తిగా అవాస్తమని.. సంపూర్ణ లాక్ డౌన్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్‌లో ఇది ఫేక్ మెసేజ్ అని కొట్టిపారేసింది. ఈ ఫేక్ మెసేజ్ ఓ హిందీ వార్తా చానెల్ నుంచి పుట్టుకొచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఉద్దవ్ థాక్రే ప్రకటనతో...
కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ అవసరంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. అవసరమైతే మరో సంపూర్ణ లాక్ డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా మరో సంపూర్ణ లాక్ డౌన్‌పై చర్చ ఊపందుకుంది. మరోవైపు, ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో లేవని.. పూర్తిగా చేతులెత్తేశాయని.. ఇక మనల్ని మనమే రక్షించుకోవాలని కూడా సోషల్ మీడియాలో మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.

తమిళ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు..
చెన్నైలో కరోనా కేసుల నియంత్రణకు నగరంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారా అంటూ మద్రాస్ హైకోర్టు కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది సుమోటో ప్రొసీడింగ్ కాదని,ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా కాదని.. తమిళనాడు పౌరులుగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని హైకోర్టు బెంచ్ పేర్కొంది. చెన్నైతో పాటు,శివారు ప్రాంతాల్లో కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ వంటి చర్యలు ఏవైనా తీసుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఇప్పటికైతే అలాంటి సూచనలేవి లేవని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు.
Recommended Video

మూడో స్థానానికి సమీపంలో..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ 2,86,756 కేసులతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అతి త్వరలోనే నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను భారత్ దాటేసే అవకాశం ఉంది. జూన్,జులైలో కేసుల తీవ్రత పీక్స్‌కు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరించినట్టుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు పెరుగుతున్న కేసులతో మెడికల్ వ్యవస్థపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కరోనా నియంత్రణకు కొత్తగా ఎటువంటి చర్యలు చేపట్టబోతుందోన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications