కమల్‌హాసన్ కారుపై యువకుడి దాడి: చితకబాది పోలీసులకు అప్పగింత
చెన్నై: మక్కల్ నీది మయమ్(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్‌హాసన్ కారుపై గుర్తుతెలియని ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి కాంచీపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్లుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆదివారం అర్ధరాత్రి తర్వాత హోటల్‌కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో కమల్ హాసన్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పార్టీ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో కమల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ మేరకు వివరాలను ఎంఎన్ఎం నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఏజీ మౌర్య ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఇలాంటి దాడులకు పార్టీ భయపడబోదని మౌర్య వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ట్వీట్‌ను మక్కల్ నీది మయమ్ అధికారిక ట్విట్టర్ ఖాతా రీట్వీట్ చేసింది. అయితే, కమల్ కారుపై దాడికి పాల్పడిన యువకుడిపై ఎంఎన్ఎం నేతలు దాడి చేశారని, వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఆ యువకుడు తాగిన మత్తులో ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నాయి.
కాగా, కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరును పెంచాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్యే ఉండనుంది. అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేస్తుండగా, డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఈ రెండు కూటములు అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రీపోల్ సర్వేలు డీఎంకేకే అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పినప్పటికీ.. మే 2న అసలైన ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications