కర్నాటకలో బీజేపీకి షాక్: మాజీ డిప్యూటీ సీఎం గుడ్‌బై..
కర్నాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీకి బీజేపీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ టికెట్ దక్కనివారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో కాషాయం పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. అసలే సర్వేలు బీజేపీకి అనుకూలంగా లేని నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ నాయకులు పార్టీని వీడటం కాషాయ నేతలకు పుండుపై కారం చల్లినట్లయ్యింది.
తాజాగా బీజేపీ నేత కర్నాటక రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. బెలగావి జిల్లాకు చెందిన లక్ష్మణ్ సవాడి అథని నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కుమతల్లి చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం కుమతల్లి బీజేపీలో కొనసాగుతున్నారు.

" పార్టీని వీడాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రాథమిక సభ్యత్వంకు రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను. గురువారం రోజున ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఆ మేరకు ముందుకు వెళతాను" అని లక్ష్మణ్ సావడి చెప్పారు.తాను బీజేపీలో చేరినప్పుడు పార్టీ ఒకలా ఉండేదని ఇప్పుడు మరోలా ఉందని చెప్పారు.గత 20 ఏళ్లుగా తనను ఆదరించిన బీజేపీ కార్యకర్తలకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక తన ప్రయాణం మరోలా ఉండబోతోందని చెప్పారు.
పార్టీలో తనను చాలా అవమానించారని చెప్పారు. తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వడం లేదని ఆరు నెలల క్రితమే చెప్పి ఉంటే బాగుండేదని సవాడి అన్నారు. ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మయ్‌ను బీజేపీలోకి తీసుకొచ్చింది తాను, సీసీ పాటిల్ అని గుర్తుచేశారు. లేదంటే నాడు బొమ్మయ్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారని చెప్పారు. యడియూరప్ప ఇంటికి తామే బొమ్మయ్‌ను తీసుకెళ్లి అసెంబ్లీ టికెట్ ఇప్పించామని ఆ తర్వాత తను ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం ఆ తర్వాత సీఎం అయ్యారని చెప్పారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరబోయేది చెబుతానని సవాడి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications