కేజ్రీవాల్‌కు షాజియా, కిరణ్ షాక్: బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు సునాయాసమేనని సర్వేలు చెబుతున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీకి మరింత అనుకూలత కనిపిస్తోందని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఓ సర్వేలో బీజేపీదే పైచేయి అని తేలింది.
తాజాగా జీన్యూస్ త్రూ తలీమ్ రీసెర్జ్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. 70 అసెంబ్లీ స్థానాలు గల ఢిల్లీలో మెజార్టీ స్థానాలు బీజేపీకే వస్తాయని తేలింది. సర్వే ప్రకారం.. బీజేపీ 37 స్థానాలతో మొదటి స్థానంలో, ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాలతో రెండో స్థానంలో ఉండనుంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం నాలుగు సీట్లే వస్తాయని తేలింది.

అధికారం చేపట్టాలంటే ఓ పార్టీకి రావాల్సిన మేజిక్ ఫిగర్ 36. బీజేపీ దానికంటే ఎక్కువ సీట్లనే గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. 45 శాతం మంది బీజేపీ గెలువవచ్చునని,, 34.2 శాతం మంది ఏఏపీ గెలువవచ్చునని చెప్పారు. 13.7 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశముందని చెప్పారు.
మంచి ప్రభుత్వం కావాలంటే బీజేపీయే బెట్టర్ అని 45.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ వైపు 34.6 శాతం మొగ్గు చూపగా, కాంగ్రెస్ పార్టీ వైపు 14.7 శాతం మొగ్గు చూపారు. ఫిబ్రవరి 7న జరగనున్న ఈ ఎన్నికల్లో మహిళల భద్రత, అభివృద్ధే కీలకంగా మారనున్నాయి.
కిరణ్ బేడీ, షాజియా ఇల్మీలు బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి మరింత మద్దతు లభించిందని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. కాగా, అరవింద్ కేజ్రీవాల్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications