ఆ పథకం కింద లబ్ది పొందాలంటే కార్డ్ లింక్ తప్పనిసరి చేసిన కేంద్రం: లింకేజీకి డెడ్‌లైన్
Ayushman Bharat: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్య పథకం.. ఆయుష్మాన్ భారత్. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబీకులకు నాణ్యమైన వైద్య సౌకర్యాన్ని అందించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఇది. 2018 సెప్టెంబర్‌లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. దీనికింద అయిదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు.
దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద లబ్ధిదారులకు కేటాయించిన గుర్తింపుకార్డుతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడితో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ లింకేజీ తప్పనిసరి అని వెల్లడించింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సీజీహెచ్ఎస్ కింద లబ్ది పొందాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా బెనిఫిషియరీ ఐడీని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీతో లింక్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలా లింక్ చేసుకోకపోతే- లబ్ది పొందలేరు.
ఈ లింకేజీ ప్రక్రియ కోసం 30 రోజుల పాటు గడువు విధించింది. దీని వల్ల సీజీహెచ్ఎస్ లబ్ధిదారుల డిజిటల్ హెల్త్ ఐడీని సృష్టించడం, వారి హెల్త్ రికార్డులన్నింటినీ కూడా భద్రపర్చవచ్చని కేంద్రం తెలిపింది. సీజీహెచ్ఎస్ లేదా ఆయుష్మాన్ భారత్ అకౌంట్ ఐడీ నంబర్‌లో ఆ హెల్త్ రికార్డులన్నీ కూడా పదిలంగా ఉంటాయని వివరించింది.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం 1954లో అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం దీన్ని అమలులోకి తెచ్చింది. 75 నగరాల్లో 41 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకం పరిధిలో ఉన్నారు. దీన్ని ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి చేర్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications