గాడిద తర్వాత మోడీపై మళ్లీ పేలిన మమత, నేనే: కేజ్రీ
లక్నో/కోల్‌కతా: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మాటల దాడిని మరింత పెంచారు. గత కొద్ది రోజులుగా మోడీ పైన విరుచుకు పడుతున్న మమత.. గురువారం ఆయనను గాడిద అంటూ సంబోధించారు. శుక్రవారం ఆమె తన మాటల వేడిని మరింత పెంచారు. మోడీని 'డంగా బాబు' (మిస్టర్ అల్లర్లు) అంటూ నిప్పులు చెరిగారు.
'మోడీ ఫర్ పిఎం' ఫండ్ వసూలు చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. మోడీ ఫర్ పిఎం అంటూ ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడం అక్రమమన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రులకు రిలీఫ్ ఫండ్స్ మాత్రమే ఉంటాయని, కొత్తగా ఈ మోడీ ఫర్ పిఎం ఫండ్ ఏమిటని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ రాజకీయ పార్టీ ప్రధాని పదవి కోసమంటూ డబ్బులు ఎలా వసూలు చేస్తుందని మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ఈ విషయమై తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మోడీ ఫర్ పిఎం ఫండ్ అక్రమమని, దీనిపై చర్యలు తీసుకోవాలని తాము ఈసిని కోరుతామన్నారు. ప్రచారంలో భాగంగా మోడీ ఫర్ పిఎం ఫండ్ అని ఉన్న ఓ కాగితాన్ని చూపిస్తూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో ఈసికి వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు ధర్నా చేసినట్లుగా తాను విన్నానని, ఇలాంటి సంఘటన తాను ఇప్పటి వరకు వినలేదన్నారు.

ప్రచారం కోసం బిజెపి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని, తొంభై శాతం మీడియాను ఆ పార్టీ కొనిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని ఆమె అభిప్రాయపడ్డారు. 2002 అల్లర్ల విషయమై ప్రస్తావిస్తూ... నాటి అల్లర్లలో మహిళలు, చిన్నారులు మృతి చెందారన్నారు. వారు అధికారంలోకి వచ్చేందుకు ఏమైనా చేస్తారని, రేపు దేశాన్ని కూడా అమ్ముతారని మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్లో అన్ని వర్గాల, మతాల, ప్రాంతాల ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారని, తమ రాష్ట్ర ప్రజలు కలిసి మెలిసి జీవించడాన్ని 'డంగా బాబు' (మిస్టర్ అల్లర్లు) జీర్ణించుకోలేకపోతున్నారని, తాము కలిసుండటంపై వారికి ఈర్ష్య, ద్వేషం ఉందని ఆరోపించారు. అయితే, ఆమె మోడీ పేరును నేరుగా ప్రస్తావించలేదు. బెంగాలీల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
త్యాగానికి ప్రతి రూపం హిందువులు అని, నిజాయితీకి ప్రతిరూపం ముస్లింలు అని, ప్రేమకు ప్రతిరూపం క్రైస్తవులు అని.. ఇదంతా మన ప్రియమైన హిందుస్తాన్ అని ఆమె అన్నారు. హిందూమతం గురించి తాము బిజెపి నుండి నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. తాము కాళీని, దుర్గాను, హనుమంతుడిని పూజించడం లేదా అని ప్రశ్నించారు. బిజెపి మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
తాము మత రాజకీయాలకు పాల్పడమన్నారు. మత రాజకీయాలకు తెర లేపింది సిపిఐ(ఎం) పార్టీ అని, ఇప్పుడు బిజెపి దానిని కొనసాగిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో లౌకికవాదాన్ని దెబ్బ తీయాలని చూసే వారు గెలవలేరని, లౌకికవాదం పట్ల నమ్మకం లేని వారు ప్రధాని కావడం కల్ల అన్నారు. వారు అభివృద్ధి పైన పోటీ పడాలని సూచించారు.
నేనే గెలుస్తా: కేజ్రీవాల్
వారణాసిలో తానే గెలుస్తానని ఎఎపి సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు. వారణాసిలో గాలి క్రమంగా తన వైపు మళ్లుతోందన్నారు. ఏడాదిలోగా మళ్లీ ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. వారణాసిలో తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications