బిజెపికి 200+: టి ఇచ్చినా తెరాసదే, జగన్‌కు 13
న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే 200కు పైగా సీట్లు సాధిస్తుందట. త్వరలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇండియా టుడే సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే రెండు వందలు సీట్లకు పైగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ వందకు పైగా మాత్రమే గెలుచుకునే అవకాశముందట. ఆమ్ ఆద్మీ పార్టీ హవా కేవలం ఢిల్లీ, మెట్రో నగరాల్లోనే ఉంటుందట.
సర్వే ప్రకారం... కాంగ్రెస్ పార్టీ 91 సీట్లు గెలుచుకుంటుంది. బిజెపి 188 స్థానాల్లో గెలుస్తుంది. బిజెపి సారథ్యంలోని ఎన్డీయే 198 - 208 మధ్య స్థానాలు గెలుచుకుంటుంది. ఇతర పార్టీలన్నీ కలిసి రెండువందలకు పైగా స్థానాలు సొంతం చేసుకుంటాయి. యూపిఏకు 28 శాతం ఓట్లు పడతాయని, ఎన్డీయేకు 27.3 శాతం ఓట్లు వస్తాయి. ఇతర పార్టీలు 44.7 శాతం ఓట్లు పంచుకుంటాయి.

దీనిని దేశంలోనే అత్యంత నిక్కచ్చి సర్వేగా అభివర్ణించింది. ప్రధాని మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీకి అత్యంత ప్రజాధరణ ఉన్నట్లు 'ఇండియాటుడే - నీల్సన్' సర్వే తేల్చింది. 'మోడీ ఉత్తమ ప్రధాని' అవుతారని సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోడీ అంటే ఆర్థికాభివృద్ధి అని 30 శాతం మంది పేర్కొనగా 22 శాతం మంది మోడీని ఆర్థికాభివృద్ధికి ప్రతీకగా గుర్తించారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌కు 15 శాతం, అద్వానీ, సుష్మా స్వరాజ్, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లకు 10 శాతం ఓటేశారు. కేజ్రీవాల్‌కు అనుకూలంగా 9 శాతం మందే ఓటేశారు.
కర్నాటకలో కాంగ్రెసుకు 12, బిజెపికి 13 దక్కే అవకాశముంది. బెంగళూరులో ఆమ్ ఆద్మీ పార్టీ బోణి కొట్టే అవకాశముంది. అక్కడ ఓ స్థానం గెలుచుకోవచ్చు. కేరళలో కాంగ్రెసు పార్టీకి ఆరు, వామపక్ష కూటమికి పదకొండు స్థానాలు దక్కుతాయి.
రాష్ట్రం విషయానికి వస్తే...
రాష్ట్రంలో బిజెపి ఓటు బలం పెరుగుతున్నా సొంతంగా ఒక్క సీటులోనూ గెలవలేదని 'ఇండియా టుడే - నీల్సన్' సర్వే తెలిపింది. టిడిపితో పొత్తు ఉభయతారకంగా మారే అవకాముందని అంచనా వేసింది. తెలంగాణలో, సీమాంధ్రలో, ముఖ్యంగా పట్టణాల్లో బిజెపిఓటు బలం పెరుగుతోందని అయితే, ఆ పార్టీ ఎక్కడా ఒక్కసీటైనా గెలుచుకునే పరిస్థితి ఉండదని, బిజెపి - టిడిపి మధ్య పొత్తు కుదిరితే రెండు పార్టీల అవకాశాలు బాగా పెరుగుతాయని సర్వే తెలిపింది.
'మూడ్ ఆఫ్ ది నేషన్ - 2014' పేరిట డిసెంబర్ 16 - జనవరి 16 మధ్య 'ఇండియా టుడే-నీల్సన్' దేశవ్యాప్త సర్వే చేసింది. ఎపిలో కాంగ్రెస్ 7 లోక్‌సభ స్థానాలకు పరిమితమవుతుందని ఈ సర్వేలో తేలింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్‌కు ఆ ప్రాంతంలో లబ్ధి చేకూరే అవకాశం లేదని పేర్కొంది.
తెరాస అత్యధికంగా 13 స్థానాలు గెలుచుకుంటుంది. మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో 13 స్థానాలను సొంతం చేసుకుంటుంది. ఎప్పట్లాగానే మజ్లిస్ ఒక్కస్థానానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. రెండు ప్రాంతాల్లోను టిడిపి బలమైన పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. అయితే సీట్లు మాత్రం 8కి పరిమితం కానున్నాయి.












Click it and Unblock the Notifications