శతాబ్దపు చంద్రగ్రహణం...వీక్షించే అదృష్టం కలుగుతుందా..?
Recommended Video

న్యూఢిల్లీ: ఆకాశంలో మరో అద్భుతం కనువిందు చేయనుంది. అయితే ఆ అద్భుతాన్ని చూసే భాగ్యం కలుగుతుందా..అంటే ఒక్క తమిళనాడులో తప్ప మిగతా దేశంలో ఆ అద్భుతాన్ని వీక్షించడం అనుమానమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ అద్భుతం ఏదో కాదు... ఈ నెల 27న సంపూర్ణ చంద్ర గ్రహణం రానుంది. ఈ సారి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది.
ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువ సమయం ఈ చంద్రగ్రహణం ఉండనుంది. సూర్యుని కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. అదే సమయంలో అంగారకుడు సూర్యుడికి ఎదురుగా రానుండటంతో అది సాధారణంగా ఉండే ఎరుపు రంగు కన్నా మరింత రెడ్ కలర్‌లో అంగారక గ్రహం కనిపిస్తుంది.అయితే ఈ భాగ్యాన్ని వీక్షించే అదృష్టం దాదాపు ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శుక్రవారం రాత్రి 11:54 నిమిషాలకు చంద్రగ్రహణం ఏర్పడి అది శనివారం తెల్లవారుజాము 3గంటల 47 నిమిషాల వరకు ఉంటుందని భారత ఖగోళ సంస్థ స్పష్టం చేసింది. అర్థరాత్రి ఒంటిగంల నుంచి 2గంటల 43 నిమిషాల మధ్య భూమి నీడ చంద్రుడిని సంపూర్ణంగా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఆరోజున ఆకాశంలో పెద్ద మేఘాలు వస్తాయి కాబట్టి ఈ అద్భుతాన్ని చాలా మంది ప్రజలు వీక్షించే అవకాశం ఉండకపోవచ్చని శాస్తంరవేత్తలు చెబుతున్నారు.
ఆ సమయానికి దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆకాశంలో మబ్బులు దట్టంగా వస్తాయి కాబట్టి ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఉండకపోవచ్చన్నారు ఖగోళ శాస్త్రవేత్త నీరజ్ మోహన్ రామానుజం. అయితే తమిళనాడు ప్రజలకు ఈ అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. అక్కడ ఆకాశంలో మేఘాలు ఉండని, ఆకాశమంతా చాలా క్లియర్‌గా ఉండటంతో చంద్రగ్రహణం వీక్షించే అవకాశం ఉందని రామానుజం తెలిపారు.
చాలామంది చంద్రగ్రహణం రోజున మూఢనమ్మకాలు పాటిస్తారని... ఆ సమయంలో భోజనం చేయడం కానీ, ఇతరత్ర పనులు చేయడం కానీ చేయరని... వాటికి దూరంగా ఉండి అవకాశం ఉంటే ప్రజలు తప్పకుండా ఆకాశంలో ఈ అద్భుతాన్ని వీక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications