మంత్రివర్గ భేటీకి ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు ఆదిత్య థాకరే సంచలనం
ముంబై: శివసేన సారథ్యంలోమహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పతనం అంచుల్లో నిలిచింది. శివసేన సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు లేవనెత్తిన తరువాత.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. శివసేనకు చెందిన 33 మంది శాసన సభ్యులు, ఏడుమంది స్వతంత్రులు ఆయన వెంట ఉండటం వల్ల మహా వికాస్ అగాఢీ కూటమి మైనారిటీలో పడింది. ఏక్‌నాథ్‌ను బుజ్జగించడానికి చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు.
ఈ పరిణామాల మధ్య ఇంకాస్సేపట్లో మహారాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే దీనికి అధ్యక్షత వహించనున్నారు. ఈ రెండు రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఇందులో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలనే అంశం ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానుంది. అసెంబ్లీని కూడా రద్దు చేయాలంటూ మంత్రివర్గం తీర్మానించే అవకాశం ఉంంది. దీనితో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.

అసెంబ్లీ రద్దవుతుందనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి కూడా. శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దీనిపై ఓ స్పష్టమైన సమాచారం కూడా ఇచ్చారు. మహారాష్ట్ర రాజకీయాలు అసెంబ్లీ రద్దు దిశగా ప్రయాణిస్తున్నాయంటూ కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే విషయంపై ఇప్పటివరకు తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే.. పెదవి విప్పలేదు. బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అసెంబ్లీ రద్దు అవుతుందనే ప్రచారం ఊపందుకున్న వేళ..ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో తన బయోలో మార్పులు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అనే పేరును తొలగించారు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కావడానికి గంట ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. బయోలో మార్పులు చేసిన కొంత సేపటికే- సంజయ్ రౌత్ బాంబు పేల్చారు. అసెంబ్లీ రద్దవుతుందనే సంకేతాలు ఇచ్చారు.
ప్రస్తుతం అందరి దృష్టీ మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశంపైనే నిలిచింది. ఉద్ధవ్ థాకరే ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠతను రేపుతోంది. ఇవ్వాళ్టి కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ రద్దపై తీర్మానం చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పతనం అంచుల్లో నిలిచిన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించకపోవడంతో ఉద్ధవ్ థాకరే.. అసెంబ్లీ రద్దు వైపే మొగ్గు చూపడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications