దుష్ప్రచారం ఆపాలని చెప్పా: సీఐడీ నోటీసుపై లోకేష్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తాను వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా వాయిదాలు కోరనని సీఐడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ ఇచ్చిన నోటీసుపై లోకేష్ స్పందించారు. పదేళ్లుగా జగన్, విజయసాయి రెడ్డి బెయిల్‌పై ఉన్నారన్నారు. వారు విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు.
వాల్ల మాదిరిగా తల్లిని ఆస్పత్రిలో పెట్టి సీబీఐ నుంచి తప్పించుకునేందుకు తాము నాటకాలు ఆడలేదన్నారు లోకేష్. సీఐడీ అధికారులు వస్తే ధైర్యంగా నోటీసులు తీసుకున్నానని.. తమపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎలాంటి తప్పు జరగలేదన్నారు. తప్పుడు కేసులు నిలబడవన్నారు.

వైసీపీ అనుబంధ విభాగంలా సీఐడీ మారిందన్నారు. సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డేలేదని.. కానీ, అవినీతి జరిగిందని కేసు పెట్టారని అన్నారు లోకేష్. గత కొన్ని రోజులుగా లోకేశ్ కనిపించడం లేదని దుష్ప్రచారం ఎందుకు చేశారని తన వద్దకు వచ్చిన సీఐడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని ఖండించకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు.
తమకున్న 9.65 ఎకరాలు అమరావతి కోర్ క్యాపిటల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని.. హెరిటేజ్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచనతో ఆనాడు భూమి కొనుగోలు చేసి ఉండవచ్చని తెలిపారు. తాను మంత్రి అయిన తర్వాత హెరిటేజ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు లోకేష్ తెలిపారు. తాను ఏనాడూ తప్పు చేయలేదన్నారు.
జగన్ మాదిరిగా క్విడ్ ప్రోకోతో పవర్ ప్లాంట్, పేపర్, ఛానల్ పెట్టలేదన్నారు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ప్యాలెస్‌లు.. ఇతర ఆస్తులు ఎక్కడా కూడా వారి పేరుతో ఉండవన్నారు. తమకు సంబంధించిన ఆస్తులు మొత్తం తమ పేరుతోనే ఉన్నాయని లోకేష్ వివరించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కు సంబంధించి డబ్బులు విడుదల చేస్తూ సంతకాలు చేసిన అజేయ కల్లం, ప్రేమ్ చంద్రారెడ్డి పేర్లు ఎందుకు ఎఫ్ఐఆర్‌లో లేవో సీఐడీ చెప్పాలన్నారు. ఇది కక్ష సాధింపు తప్ప మరోటి కాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేని కేసని అన్నారు. న్యాయ పోరాటం చేస్తామని.. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం శాంతియుతంగా ఉండాలని చంద్రబాబు చెప్పారని.. ఇందులో భాగంగానే జగన్‌కు వినిపించేలా మోత మోగించామన్నారు లోకేశ్. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications