ఎన్డిటివి సర్వే: జయలలితతో మమతా బెనర్జీ పోటీ
న్యూఢిల్లీ: లోకసభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పోటీ పడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెసు గాలి వీస్తోందని ఎన్డిటివి ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తోంది. తమిళనాడులో జయలలిత అన్నాడియంకె 29 నుంచి 32 సీట్లు గెలుచుకుందని అంచనా వేసిన ఎన్డీటివి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెసు 26 నుంచి 34 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది.
ఎన్డీటివి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం - తృణమూల్ కాంగ్రెసు పశ్చిమ బెంగాల్‌లోని 42 సీట్లలో 30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మిగతా పార్టీలు రెండంకెలు చేరుకునే అవకాశం లేదు. 2009 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కన్నా తృణమూల్ కాంగ్రెసు 11 అదనంగా పొందుతుంది.

బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారంలో తీవ్రమైన దాడి పెట్టారు. బిజెపి బలం అంతగా లేకపోయినప్పటికీ తన దాడి ద్వారా బిజెపికి దూరంగా ఉంటామనే సంకేతాలను ఇవ్వడానికే ఆమె మోడీపై వాగ్యుద్ధానికి దిగినట్లు భావిస్తున్నారు.
మోడీ ప్రచారం బిజెపికి అదనంగా ఒక్క సీటును సంపాదించి పెట్టే అవకాశం ఉంది. 2009 ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకున్న వామపక్షాలు ఈసారి ఏడు సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెసుతో కలిసి ఆరు సీట్లు గెలుచుకున్న కాంగ్రెసు ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లకు పరిమితమం కావచ్చు.












Click it and Unblock the Notifications