నీట్ యూజీ తుది ఫలితాలు ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. ఈ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సత్యమే గెలిచిందని అన్నారు.
నీట్ తుది ఫలితాలను రెండు రోజుల్లోగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేస్తుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పరిమితంగానే జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ముందు నుంచీ చెబుతోందన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

నీట్ పరీక్షల విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా ఉపేక్షించమన్నారు కేంద్రమంత్రి ప్రధాన్. పరీక్షల పవిత్రతే తమకు ముఖ్యమని అన్నారు. పరీక్షల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే.. వదిలిపెట్టమని కేంద్రమంత్రి హెచ్చరించారు. నీట్ యూజీ తుది ఫలితాలను ఎన్టీఏ రెండు రోజుల్లోగా ప్రకటిస్తుందని వెల్లడించారు.
సుప్రీంకోర్టు పరిశీలన ప్రకారమే నీట్ యూజీ మెరిట్ జాబితాను సవరిస్తామని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నీట్ అంశంపై అరాచకం, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
పరీక్షలు మళ్లీ అవసరం లేదు: సుప్రీంకోర్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను మళ్లీ జరపాలన్న డిమాండ్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ్యవస్థాగతమైన లీకేజీ, ఇతర అక్రమాలకు సంబంధించి అధికారిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో మళ్లీ పరీక్ష జరపాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ Jbపర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు, వ్యవస్థాగతమైన ఉల్లంఘన జరిగిందని చెప్పటానికి ఆధారాలు లేవని పేర్కొంది.












Click it and Unblock the Notifications