చోటా రాజన్ ఇంత చోటానా: రామ్ గోపాల్ వర్మ ట్వీట్
ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ పైన మరోసారి స్పందించాడు. చోటా రాజన్ అరెస్టైన నేపథ్యంలో ఆయన ఓసారి ట్వీట్ చేశారు. తాజాగా, సోమవారం మరోసారి ట్విట్టర్లో స్పందించాడు.
చోటా రాజన్ ఇంత చోటా అవుతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. పోలీసు అధికారుల మధ్య ఉన్న చోటా రాజన్ ఫోటోను పెట్టి ఆ ట్వీట్ చేశాడు. నాలుగు రోజుల క్రితం ట్వీట్ చేస్తూ... చోటా రాజన్ ఎవరెవరి పేర్లు బయటపెడతారోనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇన్నేళ్ల పాటు గ్యాంగ్‌ను నడపడానికి సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, పారిశ్రామికవేత్తల పేర్లు ఎవరెవరివి చోటా రాజన్ వెల్లడిస్తాడన్న విషయం ప్రస్తుతం తనకు అత్యంత ఆసక్తిని కలిగిస్తోందన్నాడు.
Never thought Chota Rajan can become so Chota pic.twitter.com/uoZGP6S3ug
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2015 మాఫియా డాన్‌ల కథాంశాలతో పలు సినిమాలు తీసి రామ్ గోపాల్ వర్మ రికార్డులకెక్కాడు. మాఫియా ప్రపంచం గురించి వర్మ చేసినంత రీసర్చ్ మరెవరూ చేయకపోవచ్చు. 2002లో వచ్చిన కంపెనీ అనే సినిమా దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్‌ల సంబంధాలకు తెర రూపమని పలువురు భావిస్తారు.
ఇదిలా ఉండగా, చోటా రాజన్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం ఇక బాలి పోలీసులకు చిక్కిందని భావిస్తున్నారు. చోటా రాజన్‌కు చెందిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను బాలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం సదరు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని వెలికితీసే పనిలో బాలి పోలీసులు నిమగ్నమయ్యారు. జైల్లో చోటా రాజన్‌ను పలుమార్లు ప్రశ్నించిన బాలి పోలీసులు అతడి నుంచి పలు కీలక అంశాలకు చెందిన సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. అతనిని భారత్ తీసుకు రానున్నారు.












Click it and Unblock the Notifications