కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై కేంద్రం తాజా రియాక్షన్
న్యూఢిల్లీ: దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం- కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 295 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ కొన్ని మృతదేహాలు బాలాసోర్‌లో ఉన్నాయి. ఆ మృతదేహాలు తమ వారివేనంటూ పలువురు రావడం వల్ల వాటిని అప్పగించే ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటోంది.
పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. పట్టాలపై పడిన కోరమాండల్ రైలు బోగీలను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని రైల్వే మంత్రిత్వ శాఖ ఇదివరకే నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ ఘోర దుర్ఘటనలో ముగ్గురు అధికారులను అరెస్ట్ చేసింది సీబీఐ. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మొహంత, సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ అరెస్ట్ అయ్యారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 304, 201 సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. తప్పుడు సిగ్నలింగ్ ఇవ్వడం వల్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైందంటూ ఇదివరకే రైల్వే బోర్డ్ నిర్వహించిన ఉన్నత స్థాయి విచారణలో తేలిన విషయం తెలిసిందే. తప్పుడు సిగ్నలింగ్ ఇవ్వడంతో ఈ ముగ్గురి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలింది.

ఇదే విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్ధారించారు. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూరక సమాధానం ఇచ్చారు. బహనగ బజార్ రైల్వే స్టేషన్ లెవెల్ క్రాసింగ్ గేట్ 94 వద్ద ఎలక్ట్రికల్ లిఫ్టింగ్ బ్యారియర్ రీప్లేస్‌మెంట్, సిగ్నలింగ్ సంబంధిత పనులు కొనసాగుతున్న సమయంలో నార్త్ సిగ్నలింగ్ కేబిన్ (గూమ్టీ) వద్ద పాసింగ్ సిగ్నలింగ్-సర్క్యూట్-మార్పులో లోపాలు చోటు చేసుకున్నాయని వివరించారు. ఇది నివారించదగ్గదని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనలో 295 మంది ప్రయాణికులు మరణించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 176 మందికి తీవ్ర గాయాలయ్యాయని, 451 మంది స్వల్పంగా గాయపడినట్లు వివరించారు. ఇంకా 41 మంది ప్రయాణికుల మృతదేహాలను గుర్తించాల్సి ఉందని, వాటిని రక్త సంబంధీకులకు అందజేయలేదని తెలిపారు. 180 మంది ప్రయాణికులకు ప్రథమ చికిత్సను అందించామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications