కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విషాదం: ప్రమాదంపై రైల్వే బోర్డ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద గటనపై దర్యాప్తును సీబీఐ(CBI)కి అప్పగించాలని రైల్వే బోర్డ్ నిర్ణయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డ్ సిఫార్సు చేసిందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన భువనేశ్వర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రమాద ఘటనా స్థలిలో సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని.. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయన్న రైల్వే మంత్రి వైష్ణవ్.. ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందన్నారు.

బాలేశ్వర్, కటక్, భువనేశ్వర్‌లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తోందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అన్ని వసతులూ కల్పించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
#WATCH | Railway Board recommends CBI probe related to #OdishaTrainAccident, announces Railways minister Vaishnaw pic.twitter.com/X9qUs55fZr
— ANI (@ANI) June 4, 2023
కాగా, శుక్రవారం రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, మరో ట్రైన్ ఢీకొనడటంతో పెను ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 275 మంది మృతి చెందగా.. 1100 మందికిపైగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సిగ్నలింగ్‌లో సమస్య కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తేలినట్లు రైల్వే బోర్డ్ సభ్యురాలు జయవర్మ సిన్హా ఆదివారం ఉదయం వెల్లడించారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందన్నారు. ఈ ఘటనలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైనట్లు.. ఆ సమయంలో దానివేగం దాదాపు గంటకు 128 కిలోమీటర్లుగా ఉన్నట్లు తెలిపారు. గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉండటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50వేలు ప్రకటించిన విషయం తెలిసిదే. ఇక ఒడిశా ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది.












Click it and Unblock the Notifications