నా భార్యకు టిక్కట్ ఇవ్వకపోతే మీ టిక్కెట్ నాకొద్దు, మాజీ ప్రధాని, మాజీ సీఎంకు ?
బెంగళూరు/హాసన్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అనేక మంది నాయకులు పోటాపోటీ పడుతున్నారు. ఇప్పటికే టిక్కెట్లు దక్కని కొందరు నాయకులు వేరే పార్టీల్లో చేరిపోయారు. కొందరు నాయకులు అయితే స్వతంత్రపార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఒక్క అసెంబ్లీ టిక్కెట్ విషయంలో మాజీ ప్రధాని ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి.
జేడీఎస్ పార్టీ మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ సొంత పార్టీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జేడీఎస్ పార్టీతో హెచ్ డీ. దేవేగౌడ కర్ణాటక సీఎం అయ్యారు. అదే జేడీఎస్ పార్టీతో హెచ్.డీ. దేవేగౌడ ప్రధాన మంత్రి అయిన విషయం తెలిసిందే. కర్ణాటక నుంచి మొదటిసారి హెచ్ డీ. దేవేగౌడ ప్రధాన మంత్రి అయ్యారు. తరువాత ఇంత వరకు కర్ణాటక నుంచి ఎవ్వరూ ప్రధాన మంత్రి కాలేదు.

అలాంటి మాజీ ప్రధాని దేవేగౌడ ఫ్యామిలీలో హాసన్ అసెంబ్లీ టిక్కెట్ విషయంలో విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి. తన భార్య భవానికి హాసన్ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు. మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ పట్టుబడుతున్నారు. నా భార్య భవానికి టిక్కెట్ ఇవ్వకపోతే తాను కూడా హళేనరసీపుర నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యనని రేవణ్ణ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసింది.

హాసన్ నియోజక వర్గం టిక్కెట్ పార్టీ కార్యకర్తకు ఇస్తానని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని ఇప్పటికే మాజీ సీఎం. మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు హెచ్.డీ. కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ దెబ్బతో కుమారస్వామి సోదరుడు రేవణ్ణ హాసన్, హళేనరసీపుర నియోజకవర్గం కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
హాసన్ లో తన భార్య భవాని, హళేనరసీపురలో తాను స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తామని, మీరు సహకరించాలని జేడీఎస్ కార్యకర్తలకు రేవణ్ణ మనవి చేశారని డెక్కన్ హెరాల్డ్ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించడం కలకలం రేపింది. మాజీ ప్రధాని దేవేగౌడ ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయని డెక్కన్ హెరాల్డ్ పత్రిక కథం ప్రచురించడంతో జేడీఎస్ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారని తెలిసింది.
ఇదే సమయంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఆయన కుమారులు కుమారస్వామి, రేవణ్ణతో పాటు జేడీఎస్ నాయకులతో సమావేశం అయ్యి ఈ విషయంలో చర్చించారని తెలిసింది. హాసన్ టిక్కెట్ విషయంలో మీడియా ముందు ఎవ్వరూ కూడా మాట్లాడకూడదని, ఈ విషయం పెద్దది చెయ్యకూడదని ఆయన కొడుకులతో పాటు జేడీఎస్ నాయకులకు సీరియస్ గా సూచించారని తెలిసింది. మొత్తం మీద మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఫ్యామిలీలో ఒక్క హాసన్ టిక్కెట్ విషయం చిచ్చు రేపడంతో జేడీఎస్ పార్టీ కార్యకర్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications