తండ్రి ఇబోబి జాడల్లో తనయుడు సూరజ్
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబిసింగ్ తనయుడు సూరజ్‌కుమార్ (29) తండ్రి బాటలో రాజకీయ వారసుడిగా ముందుకు వస్తున్నారు. తండ్రి స్థానే నాయకత్వం వహించేందుకు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబిసింగ్ తనయుడు సూరజ్‌కుమార్ (29) తండ్రి బాటలో రాజకీయ వారసుడిగా ముందుకు వస్తున్నారు. తండ్రి స్థానే నాయకత్వం వహించేందుకు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
లండన్ గ్రాడ్యుయేట్ అయిన సూరజ్‌కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వం టిక్కెట్ కేటాయించడంతో తన తల్లి లాధోనీ ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఖగాబొక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. లాధోనీ ప్రాతినిధ్యం వహించిన ఖగాబోక్ స్థానం సిఎం ఇబోబిసింగ్‌కు సొంత నియోజకవర్గం అన్న పేరుంది.
ఇబోబిసింగ్ తన భార్య కోసం థౌబాల్ స్థానానికి మారారు. తౌబాల్ నుంచి ఇబోబిసింగ్ పోటీచేసినప్పుడు బయటి వ్యక్తి అని స్థానిక నాయకత్వం అభ్యంతరాలు వ్యక్తంచేసినా గణనీయ మెజారిటీ సాధించారు.
మణిపూర్ సిఎంగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబోబిసింగ్.. తొలిసారి 1985లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇంకో గమ్మత్తేమిటంటే కొన్ని వేర్పాటువాద సంస్థలు గత ఎన్నికల్లో నిషేధం విధించడంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవరూ ఎన్నికల ప్రచారంచేయలేదు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్నా సాధారణ ప్రజల ప్రాణాల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.
ఓక్రాం సూరజ్‌కుమార్ లండన్‌లో 2008లో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేందుకు ఏడాది పాటు దూరంగా ఉన్నారు. 2010లో ఢిల్లీలో ఉన్న ఇబోబిసింగ్.. 2012 ఎన్నికల్లో తండ్రి తరఫున ప్రచారానికి మణిపూర్‌కు వచ్చారు.
విద్యార్థులు పాఠశాల ఎగ్గొట్టకుండా ఉండేందుకు, తరుచుగా సమ్మెలు, దిగ్బంధాలతో సమస్యలు తలెత్తకుండా చూడాలని సూరజ్ కుమార్ కల. అందుకోసం రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించాలని ఆయన ఆశ.. ఆకాంక్ష.
విమర్శలను తోసిరాజని డైనమిక్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సూరజ్‌కుమార్ తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడినైనా సైనికుడినని, పార్టీతోపాటు ప్రజల ఆశీస్సులతో తాను ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానన్నారు. ఇబోబిసింగ్ బంధువు ఓక్రాం హెన్రీ కూడా వాంగ్ఖైయి స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. 60 స్థానాలు గల మణిపూర్ అసెంబ్లీకి మార్చి 4,8 తేదీల్లో పోలింగ్ జరుగుతున్నది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై నాగాల వ్యతిరేకత
రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో నాగాలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. మణిపూర్‌లో నాగా మాతృభూమిలో భాగంగా పరిగణించే కొన్ని ప్రాంతాలను నాగాలాండ్‌లో కలిపి విశాల నాగాలాండ్ ఏర్పాటు చేయాలనేది ఇక్కడి నాగాల దీర్ఘకాలిక డిమాండ్. సిఎం ఇబోబీ సింగ్ క్యాబినెట్ గత నెల 8న అర్థరాత్రి సమావేశమై రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు గాను ఏడింటిని మరో ఏడు కొత్త జిల్లాలుగా విభజించింది.
తమ జనాభా ఉన్న జిల్లాల్లో నాగాల ప్రాధాన్యం తగ్గించడానికి కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని దిగ్బంధంతో ప్రతిఘటించాలని యుఎన్‌సి భావించింది.
నాగాలతో కేంద్రం సంప్రదింపులు
మణిపూర్‌లోని నాగాల సమస్య పరిష్కారానికి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం (ఇసాక్-మూయివా) తో కేంద్రం చర్చలు జరుపుతోంది. మరో పక్క ఈ దిగ్బంధం విరమించకపోవడం, నాగాలను రెచ్చగొట్టేలా సర్కారు వ్యవహరిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మార్క్సిస్ట్ తీవ్రవాద సంస్థలు కేంద్రంపై 1964 నుంచీ పోరాటం సాగిస్తున్నాయి. మరోపక్క నాగాలు తమ ప్రాంతాలను నాగాలాండ్‌లో విలీనం చేయాలని పోరుసాగిస్తున్నారు. రాష్ట్రంలో హిందువులు, క్రైస్తవులు దాదాపు సమాన సంఖ్యలో(41 శాతం) ఉన్నారు.

దిగ్బందంతో మణిపూర్ వాసులకు ఇబ్బందులు
యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్‌సి) పిలుపు మేరకు నవంబర్ నుంచి కొనసాగుతున్న ఆర్థిక దిగ్బంధం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇంకా పుంజుకోలేదు. దీనికి తోడు నోట్ల మార్పిడి కూడా ఎదురు కావడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొరతతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిఎంగా ఇబోబిసింగ్ రికార్డు
15 ఏళ్లుగా మణిపూర్‌లో సిఎం ఇబోబీసింగ్ నాయకత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి గెలుపొందేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నది. 2002లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక సిఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇబోబిసింగ్.. వరుసగా 2007, 2012 ఎన్నికల్లో కూడా పార్టీని విజయపథంలో నడిపించారు. విరామం లేకుండా 15 ఏళ్లు సీఎంగా ఉండి మణిపూర్‌లో ఆయన కొత్త రికార్డు సృష్టించారు.
2002 వరకూ రాజకీయ అస్థిరత
2002 వరకూ రాజకీయ సుస్థిరతకు దూరమైన మణిపూర్‌లో అసెంబ్లీ ఏర్పడిన 1963 జనవరి నుంచీ 19 సర్కార్లు అధికారంలోకి వచ్చాయి.ఇంతకు ముందు మూడు వేర్వేరు సందర్భాల్లో సీఎంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత రిషాంగ్ కేషింగ్ దాదాపు పదేళ్లు సిఎంగా అధికారం చెలాయించారు. రిషాంగ్ కేషింగ్ నాగా కావడం విశేషం. తొలిసారి 2002 ఎన్నికల్లో 20 సీట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ తర్వాత మెజారిటీ కూడగట్టి ఐదేళ్లపాటు పాలన సాగించడంతోపాటు 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లూ 42 సీట్లు సాధించి రాజకీయంగా ఎదురులేకుండా పాలన సాగించింది.
రెండు పార్లమెంట్ స్థానాలూ కాంగ్రెస్ ఖాతాలో..
దేశమంతా ప్రధాని నరేంద్రమోడీ ప్రభంజనం సాగి బిజెపి విజయం సాధిస్తే 2014 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని రెండు లోక్‌సభా స్థానాలను గెలుచుకున్నది. బీజేపీ అభ్యర్థిగా ఇన్నర్ మణిపూర్ నుంచి పోటీచేసిన టీహెచ్ చావ్‌బాసింగ్ వరుసగా 1996, 98, 99 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. ఆయన అప్పటి ఏబీ వాజ్‌పేయి కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. తర్వాత బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించలేదు.
10% ఓట్లతో బిజెపికి నాలుగు సీట్లు
2002 ఎన్నికల్లో దాదాపు పది శాతం ఓట్లతో బిజెపి నాలుగు సీట్లు సాధించింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఒక్క సీటూ బీజేపీకి దక్కలేదు. ఈసారి ఎన్నికల్లో మిత్రపక్షం నాగాపీపుల్స్ ఫ్రంట్‌తో కలిసి అధికారం కోసం పోటీపడుతోంది.
విలీనం నుంచే అనిశ్చితి
దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే మణిపూర్ కూడా వందల ఏళ్ల కొద్దీ రాజరిక పాలనలో మగ్గింది. బ్రిటిష్ పాలకుల సార్వభౌత్యాన్ని అంగీకరించాక మణిపూర్ హిందూ రాజకుటుంబం పాలన 1949 వరకూ సాగింది.
1949 అక్టోబర్ 15న భారత్‌లో ఈ రాజ్యాన్ని మణిపూర్ పాలకుడు విలీనంచేస్తూ షిల్లాంగ్‌లో సంతకం చేశారు. నాటి నుంచీ స్థానిక మెజారిటీ మెయితీ హిందూ వర్గంలోని కొందరు స్వాతంత్య్రం కోసం హింసామార్గాన్ని ఎంచుకున్నారు. 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా మారిన మణిపూర్ 1972 జనవరిలో పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించింది.












Click it and Unblock the Notifications