రాష్ట్రంపై ప్రధాని మోదీ కాన్సన్‌ట్రేట్..!!
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మరోసారి తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. గుజరాత్ పర్యటనకు ఆయన వెళ్లబోతోండటం 10 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ నెల చివరి వారం నాటికి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో- గుజరాత్‌లో విస్తృతంగా పర్యటిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దఫా కూడా ఆయన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
కిందటి నెల చివరివారంలో మోదీ అహ్మదాబాద్‌లో నేషనల్ గేమ్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేస్-1ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి భూపేన్ పటేల్‌తో కలిసి అందులో ప్రయాణించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకూ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీనగర్ నుంచి ముంబై సెంట్రల్ వరకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఇది. వందేభారత్ ప్రాజెక్ట్‌లో ఇది మూడో రైలు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులపాటు ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
ఇవ్వాళ మళ్లీ పర్యటించనున్నారు. ఎల్లుండి వరకు అక్కడే ఉంటారు. అదేరోజు మధ్యప్రదేశ్‌కు బయలుదేరి వెళ్తారు. తన గుజరాత్ పర్యటన సందర్భంగా ఆయన 14,500 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన గాంధీనగర్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్‌లో మెహసానా జిల్లాలోని మొధేరా వెళ్తారు.

3,900 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. 24 గంటల పాటు సౌర విద్యుత్ సరఫరా అయ్యే గ్రామం ఇది. ఇదే జిల్లాలో సబర్మతి-జగుడన్ స్టేషన్ల మధ్య గేజ్ మార్పిడి పనులకు ప్రారంభిస్తారు. అలాగే- ఓఎన్జీసికి చెందిన నందసన్ జాగ్రాఫికల్ ఆయిల్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్, సుజలాం సుఫలాం కెనాల్, ధరోహి డ్యామ్ ప్రాజెక్ట్, మొధెరా-ఛనస్మా రహదారి విస్తరణ పనులను ప్రారంభిస్తారు.
అనంతరం సాయంత్రం 6:45 నిమిషాలకు మోధేశ్వరి మాత ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 7:30 నిమిషాలకు సూర్య దేవాలయాన్ని దర్శిస్తారు. పుష్పవతి నదీ తీరంలో నిర్మితమైందీ సూర్య దేవాలయం. 1026-1027 మధ్యకాలంలో చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం గాంధీనగర్‌కు బయలుదేరి వెళ్తారు. రాజ్‌భవన్‌లో బస చేస్తారు. 10, 11 తేదీల్లో వేర్వేరు జిల్లాల్లో పర్యటిస్తారు మోదీ.












Click it and Unblock the Notifications