కేంద్రం నుంచి అద్దిరిపోయే గిఫ్ట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 35,440 కోట్ల రూపాయల విలువ చేసే రెండు కీలక వ్యవసాయ పథకాలను ప్రారంభించారు. వీటిలో ఓ పప్పుధాన్యాల మిషన్ (Pulses Mission) కూడా ఉంది. దేశంలో పప్పుధాన్యాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ మిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారాయన. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ జయంతిని పురస్కరించుకుని ఈ రెండు పథకాలకు మోదీ శ్రీకారం చుట్టారు.
దీంతో పాటు వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్యసంపద, ఆహార శుద్ధి రంగాలలో 5,450 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. సుమారు 815 కోట్ల అదనపు ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కూడా దేశ వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధికి దోహదపడేవే. 2030-31 పంట సంవత్సరం నాటికి పప్పుధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది పల్సస్ మిషన్ ముఖ్య ఉద్దేశం. దీనికి అవసరం అయ్యే వ్యయం అంచనా 11,440 కోట్ల రూపాయలు.

ప్రస్తుత దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాల దిగుబడి 252.38 లక్షల టన్నులుగా ఉంటోంది. ఈ మిషన్ ద్వారా 350 లక్షల టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే- పప్పుధాన్యాల దిగుమతులపై కూడా ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకుంటుంది. 24,000 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన 'ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన' ద్వారా తక్కువ పనితీరు కనబరుస్తున్న 100 వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పథకం ఆయా జిల్లాల్లో ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, నీటిపారుదల, నిల్వ సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను పెంపొందించడంపై దృష్టి సారిస్తారు. ఈ రెండు పథకాలు, ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం పొందినవి. రాబోయే రబీ సీజన్ నుండి 2030-31 వరకు అమలులో ఉంటాయి. వీటిలో భాగంగా బెంగళూరు, జమ్మూ-కాశ్మీర్‌లో కృత్రిమ గర్భధారణ శిక్షణా కేంద్రాలు, అమ్రేలి, బనారస్‌లలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, అస్సాంలో జాతీయ గోకుల్ మిషన్ కింద ఓ ఐవీఎఫ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు.
గుజరాత్ లోని మెహసానా, ఇండోర్, భిల్వారాలలో పాలపొడి కర్మాగారాలు, తేజ్‌పూర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఓ చేపల ఆహార కర్మాగారం కూడా ఈ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ఆయా పథకాలను ప్రారంభించిన అనంతరం వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య రంగాలు, పప్పుధాన్యాల సాగు రైతులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.












Click it and Unblock the Notifications