త్రిశంకు స్వర్గంలో సిద్దూ ప్రభుత్వం: మండ్యలో ఆందోళన
బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు వదిలిపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పడింది. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అని సీఎం సిద్దరామయ్య ఆలోచిస్తున్నారు.
సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైతే మేము కావేరీ జలాలు తమిళనాడుకు విడిచిపెట్టడం లేదని స్పష్టం చేశారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు ప్రతులు మా చేతికి అందిన తరువాత క్షుణ్ణంగా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని సిద్దరామయ్య అన్నారు.
సిద్దరామయ్య న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సిద్దరామయ్య ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ? అది ఎటు దారి తీస్తుందో ? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరో వైపు అధికారం పోయినా సరే మీరు తమిళనాడుకు నీరు వదిలిపెట్టరాదని కావేరి హితరక్షణా సమితి అధ్యక్షుడు మాదేగౌడ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే మండ్యలో ఆందోళనలు మొదలైనాయి.
మండ్యలోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య విగ్రహం ముందు రైతు సంఘాలు పెద్ద ఎత్తున గుమికూడి నిరసన వ్యక్తం చేశారు. సుప్రీ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా ప్రాణాలైనా ఇస్తాం కాని కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యడానికి అంగీకరించమని అంటున్నారు.

బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది. కావేరీ జలాల వివాదంపై ఆందోళనలు ఎక్కువకాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు నిఘా వేశారు.












Click it and Unblock the Notifications