ప్రధాని మోదీ వాయిదా వేసుకున్నారంటే..?
India Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై మిస్సైళ్లతో దాడి చేసింది.
తెల్లవారు జామున 2 గంటల సమయంలో తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాద క్యాంపులు ధ్వంసం అయ్యాయి. పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తోన్నాయి.

అదే సమయంలో అటు దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్ దీనికి కేంద్ర బిందువు అయింది. మోదీ అత్యున్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. రక్షణ, విదేశాంగ, జాతీయ భద్రత సలహా మండలి.. వంటి శాఖలు, విభాగాలకు చెందిన అధికారులు దీనికి హాజరయ్యారు.
హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రత సలహాదారు అజితో దోవల్, త్రివిధ దళాధిపతులు ఉపేంద్ర ద్వివేది (ఆర్మీ), అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి (నేవీ), అమర్ ప్రీత్ సింగ్ (వైమానిక దళం)..ఈ భేటీకి హాజరయ్యారు.
పాకిస్తాన్ భూభాగంపై ఇఫ్పటివరకు జరిగిన వైమానిక దాడులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమీక్షించారు. శతృదేశానికి ఎంత మేర నష్టం వాటిల్లింది? ఉగ్రవాద శిబిరాలు ఎంత వరకు ధ్వంసం అయ్యాయి? ఈ దాడిలో సంభవించిన ప్రాణ, ఆస్తినష్టాల గురించి ఆరా తీయనున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైందనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తాజా పరిణామాలతో ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం, తదనంతర పరిణామాలపై తన అధికారిక నివాసంలో రోజువారీ సమీక్షలను చేపట్టనున్నారాయన.
షెడ్యూల్ ప్రకారం- ఈ నెల 13వ తేదీ నుంచి మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. 17వ తేదీ వరకు నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్స్‌లల్లో పర్యటించాల్సి ఉంది. ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులతో సమావేశం కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన మినిట్స్ కూడా ఇదివరకే ఖరారు అయ్యాయి. ఇప్పుడు తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications