5 శాతం వడ్డీకి రూ.3 లక్షల రుణం ఇస్తున్న కేంద్రం
చేతి వృత్తుల్లో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తెస్తోంది. కరోనా సమయంలో చిరు వ్యాపారులకు రుణాలను అందించింది. తాజాగా చేతివృత్తులవారి కోసం పీఎం విశ్వకర్మ యోజన పేరుతో పథకం తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబరు 17వ తేదీన ప్రధానమంత్రి మోడీ దీన్ని ప్రారంభించారు.
అర్హులు ఎవరంటే..
కుమ్మరులు, శిల్పులు, నాయీబ్రాహ్మణులు, వడ్రంగులు, స్వర్ణకారులు, రజకులు, చేపల వల తయారీదారులు, మాలలు అల్లేవారు, చీపుర్లు తయారు చేసేవారు, చర్మకారులు, చెప్పుల తయారీదారులు, మేస్త్రీలు, గంపలు, చాపలు, తాళాలు, ఆయుధ, కవచ తయారీదారులు.. ఇలా 18 రకాల వృత్తుల్లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. వయసు 18 సంవత్సరాలు నిండాలి. పీఎం ఈజీపీ, ముద్ర వంటి పథకాలతో లబ్ధి పొందకుండా ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది.

దరఖాస్తు చేసుకునే విధానం
ఆధార్ కార్డు, లింక్ అయిన మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, రేషన్‌కార్డు జిరాక్స్ కాపీలతో మీసేవ, సీఎస్సీ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌కు లింక్ ఉన్న ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో మెప్మా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఐదురోజుల శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో రోజుకు రూ.500 స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ తర్వాత 15 రోజలు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్, అది పూర్తయిన తర్వాత రూ.15 వేల విలువైన టూల్ కిట్ ఇస్తారు. ఎటువంటి ష్యూరిటీ లేకుండా 5 శాతం వడ్డీతో లక్ష రుణం అందజేస్తారు. 18 వాయిదాల్లో దీన్ని చెల్లించిన తర్వాత తిరిగి 5 శాతం వడ్డీకి మరో రూ.2 లక్షల రుణం ఇస్తారు. దీనిపై అవగాహన పెంచుకొని రుణం తీసుకొని వృత్తివ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications