Prashant Kishor ప్రధానిని టార్గెట్ చేయటం వెనుక...అమిత్ షా వర్సెస్ పీకే...జగన్ తో సంప్రదించినా...!!
జాతీయ-తెలుగు రాజకీయాల్లో బాగా తెలిసిన పేరు ప్రశాంత్ కిషోర్. 2014 లో ప్రధానిగా మోదీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ వ్యూహకర్తగా ఎంట్రీ ఇచ్చి ఆయన గెలుపు వెనుక కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత వరుసగా అనేక రాష్ట్రాలు...ఏపీలో 2019 లో జగన్ ను అధికారంలోకి రావటంలో వ్యూహాలు అందించటంతో తెలుగు ప్రజల్లోనూ గుర్తింపు పొందారు. కానీ, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో నేరుగా ప్రధాని మోదీని ఢీ కొంటున్నారు. మోదీ ప్రత్యర్దులకు రాజకీయ వ్యూహాలు ఇస్తూ...మరో అడుగు ముందుకేసి వారిని ఒకే వేదిక మీదకు తేవటం..నడిపించే బాధ్యతలు తీసుకుంటున్నారు.

మమతా తో కలిసి దూకుడుగా..
తాజాగా పశ్చిమ బెంగాల్...తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మమతా-స్టాలిన్ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ పని చేసారు. బెంగాల్ అందరి కంటే ముందుగానే బీజేపీకి వంద సీట్లు కూడా దాటవని ప్రకటించారు. ఫలితాలు అదే విధంగా రావటంతో పీకే పైన నమ్మకం పార్టీలకు మరింత పెరిగింది. ఇక, ఇప్పుడు శరద్ పవార్ కేంద్రంగా మోదీ వ్యతిరేక పార్టీల కలయిక కు ప్రశాంత్ కిషోర్ తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. అయితే, 2014 లో మోదీ గెలుపు కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఇంతలా మోదీ వ్యతిరేకంగా పని చేయటానికి కారణం ఏంటనే చర్చ మొదలైంది. మోదీ విజయం తరువాత కొద్ది కాలానికే ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ, పంజాబ్, బీహార్, తాజాగా తమిళనాడు , పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యర్దుల గెలుపుకు సహకరించారు.

2014 లో కొత్త వ్యూహాలతో..మోదీ కోసం..
వాస్తవానికి వ్యూహకర్తగా ఫిక్స్డ్ రేటుకు వారికి రాజకీయ సేవలు అందించారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కోసం పని చేసినా..మధ్యలోనే వదిలేసారు. అప్పటి నుండి పక్కా కమర్షియల్..ప్రొఫెషనల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన పీకే పలు పార్టీలకు వ్యూహకర్తగా సేవలందించారు. జేడీయూ నుండి పలు కారణాలతో బహిష్కరణకు గురయ్యారు. కానీ, ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే లక్ష్యంగా చేసుకున్నారు. అయితే, 2014 లో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రశాంత్ కిషోర్ కు ఆయన టీంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారాలని ప్రశాంత్ కిషోర్ అప్పట్లో భావించారని చెబుతారు. అదే విధమైన హామీ సైతం లభించిందని అప్పట్లో ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చెప్పుకొనే వారు. కానీ, అది జరగలేదు.

అమిత్ షా వర్సెస్ ప్రశాంత్ కిషోర్..
ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మోదీకి నమ్మిన బంటు అమిత్ షా అడ్డుపడ్డారని..దీంతో..మోదీ సైతం పీకేను దూరం పెట్టారని ఒక వాదన. అప్పటి నుండి ప్రశాంత్ కిషోర్ వర్సెస్ మోదీ అన్నట్లుగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో కేవలం ఉత్తర ప్రదేశ్ ఇన్ ఛార్జ్ గా పని చేసిన అమిత్ షా అక్కడ 80 సీట్లు మోదీకి కట్టబెట్టటంలో సక్సెస్ అయ్యారు. ఆ తరువాత అమిత్ షా రేంజ్ పెరిగిపోయింది. వ్యూహకర్తల అవసరం పార్టీకి లేకుండా పోయింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున షా...ప్రత్యర్దుల తరపున పీకే అన్నట్లుగా తెర వెనుక రాజకీయాలు సాగాయి. కొన్ని చోట్ల షా రాజకీయం..కొన్ని చోట్ల పీకే వ్యూహాలు సక్సెస్ అయ్యాయి.

వ్యూహకర్త నుండి పొలిటీషియన్ గా...
ఇక, తిరిగి నితీష్ బీజేపీతో జత కట్టటం పీకేకు నచ్చలేదు. వ్యూహకర్తగా సేవలందించిన పార్టీల అధినేతలు తన మాట కాదనరనే నమ్మకంతో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యూహకర్త ఉద్యోగం వదిలేసి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారుతున్నారు. ముందుగా.. శరద్ పవార్ తో కలిసి మోదీ వ్యతిరేక శక్తులను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడితే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో..పవార్ రాష్ట్రపతి అయ్యేందుకు..మోదీని దెబ్బ తీసేందుకు ఇదే సరైన మార్గంగా భావించి పావులు కదుపుతున్నారు. కానీ, కొద్ది రోజుల క్రితం పవార్ నివాసంలో జరిగిన సమావేశం ఫలితం ఇవ్వలేదు. మూడో ఫ్రంట్..నాలుగో ఫ్రంట్ బీజేపీ పైన పని చేయవని ప్రశాంత్ కిషోర్ స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చింది.

జగన్ తో సంప్రదించినా..
ఇక, కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ ను ప్రశాంత్ కిషోర్ అమరావతిలో కలిసారు. జాతీయ రాజకీయాల పైన చర్చించారు. కేంద్రంతో తనకు సత్సంబంధాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమని వారిద్దరి మధ్య జరిగిన చర్చల్లో సీఎం తేల్చి చెప్పినట్లు సమాచారం. ఆ తరువాత హైదరాబాద్ లో కేటీఆర్ తోనూ సమావేశమయ్యారు. ఇక, ఇప్పుడు వ్యూహకర్తగా కాకుండా పొలిటీషియన్ లా జాతీయ రాజకీయాల్లో తన మార్కు చూపించాలని ప్రయత్నాలు చేస్తున్న పీకేకు..తన లక్ష్యం అంత సులువు కాదనే విషయం బాగా తెలుసు. కానీ, నేతల వెనుక ఉండి వ్యూహాలు అమలు చేస్తూ..అడుగులు వేస్తున్నారు. దీంతో.. రానున్న రోజుల్లో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications