Purvanchal Expressway : ఇంజనీరింగ్ అద్భుతం-ఫైటర్ జెట్ల ల్యాండింగ్ హైవే-ప్రత్యేకతలివే

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. ఇందులో భాగంగా తెరపైకి వచ్చినవే ఫైటర్ జెట్ ల్యాండింగ్ హైవేలు. ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏ కొత్త జాతీయ రహదారి, ఎక్స్ ప్రెస్ వే నిర్మించినా దాన్ని యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేలా నిర్మించాలనేది కేంద్రం ఉద్దేశం. ఇదే కోవలో తెరపైకి వచ్చింది పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే. ఉత్తర్ ప్రదేశ్ లోని పూర్వాంచల్ లో నిర్మించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ప్రధాని మోడీ ఇవాళ జాతికి అంకితం చేయబోతున్నారు.

 పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే

పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే

దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్ధితులకు, రవాణా అవసరాలకు అనుగుణంగా ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణాన్ని కేంద్రం చేపడుతోంది. పలు రాష్ట్రాల్లో చేపడుతున్న ఈ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టుల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతంలో ఎక్స్ ప్రెస్ వే తెరపైకి వచ్చింది.

యూపీ రాజధాని లక్నోకు రాష్ట్రంలోని తూర్పున ఉన్న జిల్లాలైన మౌ, ఆజంఘర్, బారాబంకీ, ప్రయాగ్ రాజ్, వారణాసి నగరాలను కలిపే విధంగా దీన్ని నిర్మించారు. ఈ ఎక్స్ ప్రెస్ వే రాజకీయంగా బీజేపీకి మేలు చేసేది అయితే, ప్రజావసరాల దృష్ట్యా లక్షలాది మందికి మేలు చేయబోతోంది. దీంతో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మోడీ ఇవాళ జాతికి అంకితం చేయబోతున్నారు.

 పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ప్రత్యేకతలు

పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ప్రత్యేకతలు

342 కిలోమీటర్ల పొడవున నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. లక్నో-సుల్తాన్ పూర్ హైవేపై ఉన్న చాంద్ సరాయ్ గ్రామం నుంచి ఇది ప్రారంభమవుతుంది. బారాబంకీ, అమేథీ, సుల్తాన్ పూర్, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, ఆజంఘర్, మౌ మీదుగా ప్రయాణిస్తూ ఘాజీపూర్ జిల్లాలోని హల్దారియా గ్రామం వద్ద ఇది పూర్తవుతుంది. జూలై 2018లో ప్రధాని శంఖుస్ధాపన చేసిన ఈ హైవే కేవలం మూడేళ్ల వ్యవధిలోనే శరవేగంగా రూపుదిద్దుకుంది.

మొత్తం రూ.22500 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఆరులైన్లతో నిర్మించి భవిష్యత్తులో ఎనిమిది లైన్లుగా కూడా వాడుకునే వీలున్న ఈ హైవే ప్రారంభమైతేలక్నో నుంచి ఘాజీపూర్ కు ఇప్పుడున్న ఆరు గంటల ప్రయాణం కాస్తా మూడున్నర గంటలకు తగ్గిపోనుంది.

 342 కిలోమీటర్ల ప్రయాణంలో సవాళ్లు

342 కిలోమీటర్ల ప్రయాణంలో సవాళ్లు

లక్నోలో ఓసారి పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేపైకి ఎక్కితే ఇక 342 కిలోమీటర్ల వరకూ ఏ పెట్రోల్ బంకు కానీ, రెస్టారెంట్ కానీ ఉండవు. వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకుని బయలుదేరడమొక్కటే మార్గం. అలాగే వాహనాల్లో దారి మధ్యలో అవసరమైన ఆహారం తీసకెళ్లడం కూడా ముఖ్యం. మధ్యలో ఆస్పత్రులు కూడా ఉండవు.

ఈ ఎక్స్ ప్రెస్ వే ఓసారి ఎక్కడమంటే పెద్ద సాహసం చేస్తున్నట్లే లెక్క. ఇందుకు తగినట్లుగా ఈ హైవే నిర్మించారు. దీనిపై ప్రయాణం పూర్తిగా సవాళ్లతో కూడుకున్నదే. కేవలం 100 కిలోమీటర్లకు ఒక్కసారి మాత్రమే ఆగేందుకు మధ్యలో బేలు ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రమే పెట్రోల్ పంపులు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేసే అవకాశముంది. దీంతో ప్రతీ 100 కిలోమీటర్లకు ఓసారి మాత్రమే దీనిపై విశ్రాంతికి అవకాశం ఉంటుంది.

 విమానాల ల్యాండింగ్ కు రన్ వే

విమానాల ల్యాండింగ్ కు రన్ వే

పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రన్ వే కూడా ఏర్పాటు చేశారు. రోడ్డుపై సాధారణంగా ప్రయాణించే వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుల్తాన్ పూర్ జిల్లాలోని కుదేభర్ ప్రాంతంలో ఈ రన్ వే ఉంటుంది. ఇక్కడ అత్యాధునిక ఫైటర్ జెట్ యుద్ధ విమానాల్ని సైతం ల్యాండ్ చేసేందుకు వీలుంది. ఇవాళ ప్రధానమంత్రి మోడీ ఫైటర్ జెట్ విమానంలో ఇక్కడికి చేరుకుని ల్యాండ్ అవుతారు. అక్కడే ప్రారంభోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రన్ వే నుంచి విమానాలు టేకాఫ్ అయ్యేందుకు కూడా వీలుంది.

 కనెక్టివిటీతో ఆర్ధిక వృద్ధికి ఊతం

కనెక్టివిటీతో ఆర్ధిక వృద్ధికి ఊతం

పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేపైకి ఎక్కేందుకు మధ్యలో 18 ఫ్లైఓవర్లు ఏర్పాటు చేశారు., అలాగే ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లు ఉన్నాయి. అలాగే ఏడు పొడవైన వంతెనలు నిర్మించారు. 104 చిన్న తరహా వంతెనలు కూడా హైవేపై వస్తాయి. 13 మళ్లింపు దారులతో పాటు 271 అండర్ పాస్ లు కూడా ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు ముఖ్యంగా లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్ నగర్, అజంగఢ్, మౌ, ఘాజీపూర్ జిల్లాల్లో ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నందున ఆయా జిల్లాల ప్రజలకు ఆ మేరకు ఆర్ధిక ప్రయోజనం ఉంటుందని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+