మోడీ చేతిలో టీఆర్ఎస్ రిమోట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఫైర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న రాహుల్.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును తూర్పారబట్టారు.

మోడీ చేతిలో టీఆర్ఎస్ రిమోట్
బీజేపీ, టీఆర్ఎస్ బంధంపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా సహకరించుకుంటూ పైకి మాత్రం ప్రత్యర్థులుగా నటిస్తూ మోడీ, కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. మోడీ చెప్పినట్లే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం రిమోట్ మోడీ చేతిలో ఉందని ఆరోపించారు. ఆ కారణంగానే నోట్ల రద్దు, జీఎస్టీకి ఆయన మద్దతు పలికారని చెప్పారు. రఫెల్ కుంభకోణంపై కేసీఆర్, మోడీని ఎందుకు ప్రశ్నించడంలేదన్న రాహుల్... కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీపై పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.

దొంగలకు చౌకీదార్‌లా మోడీ
చౌకీదార్‌నని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ.. దేశంలో దొంగలకు కాపలాదారుగా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నీరవ్ మోడీలాంటి ఆర్థిక నేరగాళ్లకు చౌకీదార్‌గా వ్యవహరించి వారిని దేశం దాటించాడని అన్నారు. 15 మంది అనుయాయుల కోసం రూ.15వేల కోట్లు వెచ్చిస్తున్న మోడీ దేశ సంపదను వారికి దోచి పెడుతున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే దేశంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులను తన సన్నిహితులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

పేదరికంపై సర్జికల్ స్ట్రైక్
బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల డబ్బు వేస్తామంటూ హామీ ఇచ్చిన మోడీ.. దాన్ని నెరవేర్చకపోగా.. పేదలపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారని రాహుల్ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి రాలేదన్న ఆయన.. జీఎస్టీ పేరుతో గబ్బర్ సింగ్ ట్యాక్స్ తీసుకొచ్చి పేద, మధ్య తరగతి, చిరు వ్యాపారుల నడ్డి విరిచారని అన్నారు. ఏటా 2కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని మోసం చేసిన ఘనత ఆయనదేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న రాహుల్.. ప్రతి పేదవాడి ఖాతాలో ఏడాదికి రూ. 72 వేలు వేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications