ఇదంతా మామూలే: పావులు కదుపుతున్న పన్నీరు, ఎమ్మెల్యేల ఆందోళన
అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు.
విభేదాలు సహజమేనని, కానీ మనం ఐక్యంగా ఉండాలని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అందరం కలిసి అమ్మ ఆశయాల కోసం పని చేద్దామన్నారు. తమిళనాడులో అమ్మ పాలన కొనసాగుతుందన్నారు.
ప్రజలందరూ సహనంతో ఉండాలని, అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. పార్టీ చీలుతుందని ప్రత్యర్థులు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత ఆత్మ మన చుట్టే తిరుగుతోందన్నారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేలకు లేఖ కూడా రాశారు.
ఎమ్మెల్యేల్లో కలవరం.. పన్నీర్‌కు పెరుగుతున్న మద్దతు
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారవడంతో గోల్డెన్ బే రిసార్ట్‌లోని ఎమ్మెల్యేల శిబిరంలో కలవరం మొదలైంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో శశికళ పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలు.

దీంతో శశికళ శిబిరం నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.
పన్నీరు చర్చలు
పన్నీర్ సెల్వానికి ఎమ్మెల్యేల నుంచి క్రమంగా మద్దతు పెరుగుతోంది. మంగళవారం ఉదయం మేటూరు ఎమ్మెల్యే షెమ్మలయ్ మద్దతు పలకగా, తీర్పు వెలువడిన తర్వాత మరో ఎమ్మెల్యే చిన్నరాజ్ మద్దతు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు సెల్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. ఎమ్మెల్యేలతో పాటు 11 మంది ఎంపీలు కూడా ఆయనకు మద్దతుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications