Adani Group : అదానీ గ్రూప్ పై సీబీఐ, ఈడీ దర్యాప్తు ? పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం..
హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కు మొదలైన కష్టాలు మరింత పెరగబోతున్నాయి. ఆర్ధిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ పై దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. ఎల్లుండి ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంటులో జేపీసీ కోసం విపక్షాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

అదానీ గ్రూప్ పై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత డాక్టర్ జయా ఠాకూర్ అత్యవసర విచారణ కోరారు. అయితే దీనిపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్.. తొలుత ఫిబ్రవరి 24న విచారణ చేపడతామని తెలిపారు. అయితే ఇప్పటికే దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ ఫిబ్రవరి 17న ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది సీజే దృష్టికి తెచ్చారు. దీంతో ఎల్లుండే ఈ రెండు పిటిషన్లతో కలిపి దీన్ని కూడా విచారిస్తామని పేర్కొన్నారు.
అలాగే కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ ఈ పిటిషన్లో అదానీ గ్రూప్ లో ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్ధలు భారీ మొత్తాలు పెట్టుబడులు పెట్టడంపైనా విచారణ కోరారు. బహిరంగ మార్కెట్లో షేర్ విలువ రూ.1800 ఉండగా.. దాన్ని కాదని అదానీ గ్రూప్ లో ఈ రెండు సంస్ధలు రూ.3200కు ఒక్కో షేర్ కొనుగోలు చేయడాన్ని ప్రశ్నించారు.
గౌతమ్ అదానీ, ఆయన సహచరులు లక్షల కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఆరోపించిన పిటిషనర్.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ, ఈడీ, డీఆర్ఐ, సెబీ, ఆర్బీఐ, ఎస్ఎఫ్ఐవో వంటి సంస్ధలతో దర్యాప్తు చేయించాలని కోరారు.












Click it and Unblock the Notifications