అస్థికలు షీనావే: ఇంద్రాణి చుట్టూ ఉచ్చు
ముంబై: షీనా బొరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖార్జియా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. షీనా బొరా హత్యకు గురైనట్లు నిర్ధారణ అయింది. రాయగఢ్ అడవుల్లో పోలీసులు సేకరించిన అస్థికలు షీనా బొరావేనని డిఎన్ఎ పరీక్షల్లో తేలినట్లు పోలీసులు తెలిపారు.
ఆ నమూనాలు ఇంద్రాణి డిఎన్ఎతో సరిపోలినట్లు పరీక్షల్లో తేలినట్లు కూడా చెబుతున్నారు. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి డ్రైవర్ శ్యామ్ రాయ్ సహాయంతో షీనా బొరాను హత్య చేసినట్లు ఇంద్రాణి పోలీసు విచారణలో అంగీకరించిన విషయం తెలిసిందే. షీనా శవాన్ని రాయగఢ్ అడవుల్లోకి తీసుకుని వెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు.

కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇటీవల నిందితులను సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి అస్థికలు, పుర్రెలను సేకరించారు. పరీక్షల్లో ఆ అస్థికలు షీనా బొరావేనని తేలింది. కాగా, ఇంద్రాణిని, రాయ్‌ను ముంబై పోలీసులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వారిని 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింేది. మరో నిందితుడు సంజీవ్ ఖన్నా పోలీసు కస్టడీ పొడగించింది.
షీనా బొరా ఇంటి అద్దె ఒప్పందాన్ని రద్దు చేసుకున్న లేఖను ఇంద్రాణి డ్రైవర్ ద్వారా ఇంటి యజమానికి పంపించినట్లు సమాచారం. రెండు లేఖలపై షీనా బొరా సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఒకటి ఇంటి కిరాయిని రద్దు చేసుకుంటూ రాసిన లేఖ కాగా, మరోటి ఉద్యోగానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖ.












Click it and Unblock the Notifications