ఒబామా, గాంధీ విరాళాలా: సర్వేలపైనా విరుచుకుపడిన మోడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వస్తున్న సర్వేలన్నీ చెత్త అని, అబద్ధాల పుట్టలని ప్రధాని నరేంద్ర మోడీ కొట్టి పారేశారు.ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగానే ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటూ వచ్చిన ఈ సర్వేలను ఎంత మాత్రం విశ్వసించడానికి వీల్లేదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగునున్న దృష్ట్యా బుధవారం తుది ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకే మెజార్టీ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుందని కానీ, అతి పెద్ద పార్టీగా కూడా అవతరించలేక పోయిందని మోదీ తెలిపారు. ఈ తరహా సర్వే ఫలితాల్లో కొట్టుకు పోకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను వారణాసి నుంచి పోటీ చేసినప్పుడు కూడా తనకు వ్యతిరేకంగానే సర్వేలు వెలువడ్డాయని, తాను మూడు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోతానని ప్రచారం చేశారని మోదీ గుర్తు చేశారు.

అలాంటి సర్వేలు ఎవరు చేశారో తనకు తెలియదన్నారు. కనీసం తన లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేని వ్యక్తి తనను అతిగా ఊహించుకుంటున్నారని కేజ్రీవాల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోడీ వ్యాఖ్యానించారు.
తప్పుడు మార్గాల్లో విరాళాలు సేకరించిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకు పడ్డ మోదీ ‘మీరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళం ఇచ్చారా..దాన్ని నిర్థారించుకున్నారా..' అని తన స్నేహితులు అడిగారని తెలిపారు.
మహాత్మా గాంధీ, బరాక్ ఒబామాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలు ఇచ్చారన్న విషయాన్ని తెలుసుకుని దిగ్భ్రాంతి చెందానన్నారు. ఇలాంటి వ్యక్తులను ఏమనాలో అర్థం కావడం లేదని, పచ్చి అబద్ధాలు చెప్పేవారికి రాజకీయాల్లో స్థానం ఉండకూడదని ప్రధాని తెలిపారు.












Click it and Unblock the Notifications