మోదీ 100 రోజుల పాలన.. 1,000 రోజుల యాక్షన్ ప్లాన్
Chandrababu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం.. గుజరాత్ పర్యటనలో ఉన్నారు. గాంధీ నగర్‌లో గల మహాత్మా మందిర్‌లో ఏర్పాటు చేసిన రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2024 నాలుగో విడత సమావేశాన్ని ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ పటేల్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు, వనరులు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం కల్పిస్తోన్న రాయితీలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలపై చర్చించడానికి ఈ సదస్సు ఏర్పాటైంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా వివిధ రాష్ట్రాల సీఎంలు ఇందులో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలు తమ స్టాల్స్‌ను ఈ ఎక్స్‌పోలో ఏర్పాటు చేశాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల్లో పెట్టుబడులను పెట్టడానికి గల అవకాశాలపై సందర్శకులకు వివరిస్తోన్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తొలి 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి వివరించారు.
100 రోజుల్లో కొత్తగా 12 పారిశ్రామిక నగరాలను నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎనిమిది హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులు ఆమోదించామని గుర్తు చేశారు. 15కు పైగా మేడిన్ ఇండియా సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు.
ఆర్ అండ్ డీకి తాము అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, దీన్ని ప్రోత్సహించడానికి ఒక ట్రిలియన్ మొత్తంతో ప్రత్యేకంగా ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు మోదీ తెలిపారు. బయో-ఇ3 విధానం ఆమోదించామని, ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) సైతం అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
రెన్యూవబుల్ ఎనర్జీ, సంప్రదాయేతర ఇంధన వనరులు, సౌర విద్యుత్ రంగంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలను ఈ తొలి వంద రోజుల్లోనే తీసుకున్నామని మోదీ వివరించారు. 1,000 రోజుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications