రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పోలింగ్.. ఆ పార్టీ విజయాన్ని ఆపేదెవరు..??
తమిళనాడు ఓటర్లు చరిత్ర సృష్టించారు. కనీవినీ ఎరుగని రీతిలో ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు 82. 24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి కాగా.. అప్పటికే క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దాంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కనీవినీ ఎరగని రేంజ్ లో రికార్డు సృష్టించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సాయంత్రం 5 గంటల వరకు 82.24 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 1952 నుంచి ఇదే అత్యధిక శాతం ఓటింగ్ కావడం విశేషం. 2011 ఎన్నికల్లో ఓవరాల్ గా 78.29 శాతం పోలింగ్ నమోదైంది.
సీఎం స్టాలిన్ నియోజకవర్గం కొలత్తూర్ లో 83.58 శాతం పోలింగ్ నమైదైంది. పళనిస్వామి నియోజకవర్గం అయిన ఎడప్పాడిలో 89.09 శాతం, విజయ్ నియోజకవర్గం అయిన పెరంబూర్ లో 86.72 శాతం అలాగే తిరుచ్చి ఈస్ట్ లో 79.32 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో 81.34శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలాగే కొంగునాడు ప్రాంత జిల్లాలైన కోయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, నమక్కల్, కరూర్, నీలగిరి, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో కూడా దాదాపు 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు స్పష్టం అవుతోంది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

తమిళనాడుతో పాటు పశ్చిమ్ బెంగాల్ లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. తొలి విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకే బెంగాల్ లో ఏకంగా 89.93 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 6 గంటలకు పోలింగ్ పూర్తికాగా క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు అవకాశం కల్పిస్తున్నారు. 2021లో 82.29 శాతం నమోదు అయింది. ఇక బెంగాల్ లో రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 29 న జరగనున్నాయి. ఇక తమిళనాడు, బెంగాల్ ఎన్నికల ఫలితాలు మే 4 న వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications