ఢిల్లీ ఎలక్షన్స్: బీజేపీకి టీడీపీ సపోర్ట్, బాబుకి కేంద్రమంత్రి ఫోన్ కానీ..
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లోను బీజేపీకి టీడీపీ మద్దతు పలుకుతోంది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వారి ఓట్లు కీలకంగా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ నేత, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం సాయంత్రం ఫోన్ చేశారు.

బీజేపీకి ఓటేయాలని ఢిల్లీ తెలుగు ప్రజలకు పిలుపునివ్వాలని చంద్రబాబును కోరారు. అయితే, అప్పటికే ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో చంద్రబాబు ప్రకటన చేయలేకపోయారని సమాచారం. అయితే, పత్రికా ప్రకటనల ద్వారా ప్రచారం చేయనుంది.
కాగా, ఎన్నికల ప్రచార ముగింపు సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గురువారం నాడు ఢిల్లీలోని ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications