అఖిలేష్ జోష్: మాయావతి ఇంటికి వెళ్లి గంటసేపు మంతనాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రెండు లోకసభ స్తానాల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ జోష్ మీద ఉన్నట్లు కనిపించారు. తమ అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇచ్చిన బిఎస్పీ నేత మాయావతికి ఆయన బుధవారం ధన్యవాదాలు తెలిపారు.
బిఎస్పీతో తాము పొత్తు పెట్టుకుని ఉంటే 2017 ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం వచ్చి ఉండేది కాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన మాయావతి నివాసానికి వెళ్లారు. వారిరువురి మధ్య దాదాపు గంట సేపు మంతనాలు జరిగాయి.

కాంగ్రెసు ఎస్పీ పొత్తు వల్ల...
2017 శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంది. అయినప్పటికీ ఘోర పరాజయాన్ని చవి చూసింంది. శాసనసభ ఎన్నికల్లో 300 సీట్లకు పోటీ చేసి ఎస్పీ 47 సీట్లు కాంగ్రెసు 7 సీట్లు గెలుచుకున్నాయి. యుపిలో 403 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి కూటమి 325 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా కాంగ్రెసుతో పొత్తును కొనసాగిస్తామని అఖిలేష్ యాదవ్ చెప్పారు.

అయితే అఖిలేష్ ఇలా చేశారు...
గత 11 నెలలుగా అఖిలేష్ యాదవ్ కాంగ్రెసు పార్టీకి దూరం జరుగుతున్నట్లు కనిపించారు. గోరఖ్‌పూర్, ఫుల్పూరు లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసుకు పూర్తిగా దూరమయ్యారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆ స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో ఆ రెండు స్థానాల ఉప ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యం చేకూరింది. ఆ రెండు సీట్లను ఎస్పీ గెలుచుకోవడం యుపి రాజకీయాల్లో ఓ మలుపుగానే చూడాల్సి ఉంటుంది.

మాయావతి ఇలా చేశారు...
గోరఖ్‌పూర్, పుల్పూరు నియోజకవర్గాల్లో మాయావతి తన పార్టీ అభ్యర్థులను పోటీకి దించలేదు. ఎస్పీ అభ్యర్తులకు ఓటేయాలని ఆమె తన పార్టీ కార్యకర్తలకు సూచించారు. అయితే, 2019 ఎన్నికల్లో ఎస్పీ, బిఎస్పీ కలిసి పోటీ చేసే విషయంపై అఖిలేష్ యాదవ్ స్పష్టత ఇవ్వలేదు.

వారికి ఇక బురేదిన్
ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై దెబ్బ వేస్తోందని, సమయం వచ్చినప్పుడు ప్రజలు దానికి గుణపాఠం చెబుతారని, ప్రస్తుత ఫలితాలు కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలపై ఇచ్చిన తీర్పు అని అఖిలేష్ యాదవ్ అన్నారు. అచ్చే దిన్ (మంచి రోజులు) రాలేదని, ప్రజలను కూడగట్టడంలో వారు ఫలితం సాధించారని, వారికి బురే దిన్ (చెడు రోజులు) దగ్గర పడ్డాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications