జయకు అనారోగ్యం: తాత్కాలిక ముఖ్యమంత్రి నువ్వా ? నేనా ?
చెన్నై: తమిళనాడు రాజకీయాలను ఆరాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని ఆయన చెన్నైలోనే మకాం వేశారు.
జయకు అనారోగ్యం, తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రి పదవి తెర మీదకు రావడంతో ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగార్ రావు చెన్నై చేరుకున్నారు. రాజ్ భవన్ లో తమిళనాడు సీనియర్ మంత్రులు పన్నీరు సెల్వం, ఎడప్పాటి పళని స్వామి గవర్నర్ ను కలుసుకున్నారు.
ఆ సందర్బంలో వారి వెంట తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ మోహన్ రావు ఉన్నారు. జయలలిత ఆరోగ్యం గురించి, తమిళనాడు రోజువారి పరిపాలన గురించి ఈ ముగ్గురు క్షుణ్ణంగా ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు వివరించారు.

అప్పటి వరకు ఆ ఇద్దరు మంత్రులు తాత్కాలిక ముఖ్యమంత్రి పదవి గురించి గవర్నర్ తో చర్చించలేదని సమాచారం. సీనియర్ మంత్రులు, తమిళనాడు చీఫ్ సెక్రటరీ రోజువారి పరిపాలన సమాచారం గురించి ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు వివరించారని రాజ్ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
తరువాత పన్నీరు సెల్వం, పళని స్వామి సహచర కేబినెల్ మంత్రులతో సమావేశం అయ్యారు. తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అని చర్చించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
జయలలితకు 2001, 2014లో న్యాయపరమైన ఆటంకాలు ఎదురైన సమయంలో తన విధేయుడు పన్నీరు సెల్వంను సీఎం చేసిన అమ్మ ఆయనకు తమిళనాడు పరిపాలనా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పళని స్వామి కూడా కీలక మంత్రి పదవిలో ఉన్నారు.
రెండు సార్లు సీఎం అయిన పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి కార్యాలయంలో అడుగుపెట్టకుండా, తన కార్యాలయం నుంచి పరిపాన సాగించి అమ్మ విధేయతను చాటుకున్నారు. అమ్మకు విధేయుడు అంటే పన్నీరు సెల్వం అని అన్నాడీఎంకే నాయకులు అన్నారు.
అమ్మ నమ్మినబంటు పన్నీరు సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిని చెయ్యాలని చాల మంది మంత్రులు అంటున్నారు. అయితే రంగంలోకి పళని స్వామి రావడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎక్కువ అవకాశాలు పన్నీరు సెల్వంకే ఉన్నాయని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications