కాంగ్రెసులో తెరాస విలీనం ఖరారు: బొత్స విందు
న్యూఢిల్లీ: కాంగ్రెసులో కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం ఖరారైనట్లే. తమ పార్టీలో తెరాస విలీనం చర్చలు ముగిశాయని, విధివిధానాలపై మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెరాస కొన్ని షరతులు పెడుతోందని, సీట్ల సంఖ్యపై చర్చలు మిగిలి ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, బేషరతుగా కాంగ్రెసులో తెరాసను విలీనం చేస్తామనే మాటకు కెసిఆర్ కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.
సీమాంధ్ర నేతలతో వార్ రూంలో జరిగిన సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఏర్పాటుపై రేపు స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయంపై చర్చ సాగుతోందని ఆయన అన్నారు. లోకసభకు, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు.

వారంలోగా రెండు పిసిసిలు, రెండు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పోటీ పడాలని ఆయన అన్నారు. సీమాంధ్రకు పెద్ద తీర ప్రాంతం ఉందని, సీమాంధ్రకు కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు. ఇచ్చిన మాటకు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించాయని, వాటి వైఖరిని ఎండగడుతామని ఆయన చెప్పారు. ఎన్నికలను ఐక్యంగా, సమర్థంగా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.
కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పదవిపై కన్నేసినట్లు కనిపిస్తున్నారు. దాంతో ఆయన ఢిల్లీలో విందు రాజకీయాలు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఆయన విందు ఇచ్చారు.












Click it and Unblock the Notifications