విజయ్ కు మళ్లీ సమన్లు- ఈ సారి?
ప్రముఖ నటుడు, తమిళగ వెట్టి కజగం అధినేత విజయ్‌కు ఇబ్బందులు తప్పట్లేదు. ఒకవంక ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోన్న ఆయన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఆయన సుడిగాలి ప్రచారానికి అనూహ్యంగా బ్రేకులు పడుతున్నాయి. సీబీఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించింది.
ఈ కేసులో విజయ్ గతంలో రెండుసార్లు సీబీఐ విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు జనవరి 12, 19 తేదీల్లో దేశ రాజధానిలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. తమిళనాడులోని కరూర్ లో గత ఏడాది సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఈ సీబీఐ విచారణకు ప్రధాన కారణం. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు.

విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు అదనపు ఆధారాలు, సామాగ్రిని సేకరించారు. వీటిపై విజయ్ నుండి మరింత స్పష్టమైన సమాచారం అవసరం కావడంతో ఆయనకు తాజాగా సమన్లు జారీ అయ్యాయి. ఈ దుర్ఘటనపై మొదట ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకుంది. దీంతో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. కోర్టు ఆదేశాలతో కేంద్ర ఏజెన్సీ ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను నిర్ధారించడానికి ఆధారాలను సేకరిస్తోంది, సాక్షులను విచారిస్తోంది.
సిట్ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ గత ఏడాది జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్‌వీ అంజారియాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ దుర్ఘటన ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, రాజకీయ సభలో 41 మంది ప్రాణాలను కోల్పోవడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించింది. ఈ తొక్కిసలాట దేశ ప్రజల మనస్సులపై ప్రగాఢ ముద్ర వేసిందని, పౌరుల జీవితాలపై దీనికి విస్తృత ప్రభావం ఉందని పేర్కొంది. ప్రాణాలు కోల్పోవడానికి గల ప్రాథమిక హక్కులను తెలుసుకోవడం వారి బాధ్యత అని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications