గరీబీ హటావో, సమజ్వాద్ పేరుతో దేశాన్ని దోచుకున్నారు: కాంగ్రెస్, ఎస్పీలపై ప్రధాని మోడీ నిప్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారు "గరీబీ హటావో, సమాజ్వాద్ (సోషలిజం)" పేరుతో దేశాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో ఐదవ దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ వరుసగా నాలుగో విజయం సాధిస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. 'ఈసారి మనం 'జీత్ కా చౌకా' (విజయం 4)ని కొట్టబోతున్నాం...మొదట 2014లో, తర్వాత 2017, 2019, ఇప్పుడు 2022. 'పరివార్వాడీ'లను పడగొట్టాలని యూపీ ప్రజలు నిర్ణయించుకున్నారు అని బహ్రైచ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

కోవిడ్-19 వ్యాక్సిన్‌ను 'బీజేపీ వ్యాక్సిన్' అని పిలిచినందుకు సమాజ్‌వాదీ పార్టీని కూడా పీఎం మోడీ తప్పుబట్టారు. "వ్యాక్సిన్‌ల కోసం మీరు వాటిని విననట్లే, ఓట్ల కోసం కూడా వారి మాటలను వినవద్దు" అని బహ్రైచ్‌లో పీఎం మోడీ అన్నారు.
"పరివార్వాది పార్టీలు అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పరివార్వాది పార్టీల పనితీరును నేను చాలా దగ్గరగా చూశాను. వారికి ప్రజల సంక్షేమం గురించి అస్సలు పట్టింపు లేదు" అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మూడు దశల్లో 172 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు నాలుగో విడతగా 59 స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది.
అఖిలేష్, ప్రియాంకలపై జేపీ నడ్డా విమర్శలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియాలోని రుద్రాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. రాజ్యాంగాన్ని కాదు.. ఉగ్రవాదుల్ని రక్షిస్తామంటూ దేవుడి వద్ద ప్రమాణం చేశారంటూ జేపీ నడ్డా విమర్శించారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో పలు ఉగ్రదాడుల్లో నిందితులుగా ఉన్నవారిపై కేసుల్ని అఖిలేష్ ఉపసంహరించుకున్నారని అన్నారు. ఎవరైనా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని దేవుడి వద్ద ప్రమాణం చేస్తారు.. కానీ, అఖిలేష్ మాత్రం ఉగ్రవాదుల్ని రక్షిస్తానని ప్రమాణం చేశారంటూ ధ్వజమెత్తారు.
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో గత శుక్రవారం కోర్టు 38 మంది దోషులకు మరణశిక్ష విధించగా. వారిలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త మహమ్మద్ సైఫ్ తండ్రి షాదాబ్ అహ్మద్ కూడా ఉన్నారన్నారు. మరోవైపు, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాపైనా జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని పనికిమాలిన అంశంగా ఆమె పేర్కొనడాన్ని నడ్డా తప్పుబట్టారు.
ప్రియాంక తండ్రి రాజీవ్ గాంధీ కూడా ఉగ్రదాడిలో మరణించారు. కానీ, ఆమెకు ఈ అంశం పనికిరాదట. రాష్ట్రంలో గూండా రాజ్, మాఫియారాజ్‌ను యోగి ఆదిత్యనాథ్ అంతం చేశారని అన్నారు. దేశ వ్యతిరేక శక్తుల్ని జైళ్లో పెట్టారు. ఐదేళ్ల క్రితం ఆజంఖాన్, ముఖ్తార్ అన్సారీ, అతిక్ అహ్మద్ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేవారు. కానీ, గత ఐదేళ్లలో వీరంతా జైలులోనే ఉన్నారు. అందువల్ల బీజేపీకి ఓటేసీ మళ్లీ యోగిని గెలిపించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు జేపీ నడ్డా.
యోగి ఆదిత్యనాథ్ పాలనలో రాష్ట్ర ప్రజలు దీపావళి, హోలీ వంటి పండగలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. గతంలోనూ యూపీలో కూడా తరచూ దీపావళి వచ్చేది. కానీ, అయోధ్యలో దీపోత్సవ్ ఎందుకు జరగలేదు? గతంలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేది. కానీ, మథురను ముస్తాబు చేసేవారు కాదెందుకు? దేవ దీపావళికి వారణాసిని అలంకరించేవారు కాదెందుకు? కానీ, బీజేపీ పాలనలో దీపోత్సవ్ వంటి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని జేపీ నడ్డా తెలిపారు. మీ ఓటుకు ఉన్న శక్తి ఇదే.. అభివృద్ధి పనులు చేశామని చెప్పి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం సమాజ్ వాదీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదన్నారు జేపీ నడ్డా. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీజేపీ నేతలు మాత్రమే ఏది చెప్పారో అది చేస్తారన్నారు. యూపీ ప్రజలు మరోసారి అభివృద్ధికి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications