అక్కడ కూడా దర్జాగానే: 100 కోట్ల భవంతిలో మాల్యా
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ. 9000 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా అక్కడ కూడా దర్జాగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. యూకేకు చెందిన ద సండే టైమ్స్ పత్రిక విజయ్ మాల్యాపై ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
ఆ వార్తా కథనంలో కింగ్ ఫిషర్ మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యా యూకే హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని తెవిన్ గ్రామంలో ఉన్నారని తెలిపింది. ఉత్తర లండన్ నుంచి గంట ప్రయాణముండే హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని ఈ గ్రామంలో లేడీవాక్ పేరు గల మూడు అంతస్థుల భవనంలో ఆయన నివసిస్తున్నట్లు రాసింది.
అంతేకాదు లేడీ వాక్ అని పిలిచే ఈ మూడు అంతస్థుల భవనం విలువెంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు దీని విలువ రూ. 100 కోట్లు. ఈ భవనాన్ని మాల్యా బ్రిటిష్ ఫార్ములా వన్ ఛాంపియన్ లెవిస్ హామిల్టన్ తండ్రి నుంచి ఓ సంస్థ ద్వారా కొనుగోలు చేశారని చెప్పింది.
లేడీ వాక్ తన అధికారిక నివాసమంటూ స్వయంగా మాల్యానే వెల్లడించారని, భారత అధికారులకు కూడా ఆ సమాచారం అందించినట్లు 'ది సండే టైమ్స్' ఆ వార్తా కథనంలో తెలిపింది. దీంతో పాటు బ్రిటన్ ఓటర్ల జాబితాలో మాల్యా పేరు ఉందని కూడా అందులో పేర్కొంది.

1992 నుంచే ఆయన బ్రిటన్ పౌరుడిగా ఉన్నాడట. దీంతో బ్రిటన్ ఓటర్ల జాబితాలో మాల్యా పేరు ఉండటంతో ఆయన బ్రిటీష్ పౌరుడు అవుతారు. దీంతో మాల్యాను భారత్‌కు తెచ్చి చట్టం ముందు దోషిగా నిలిపే అవకాశం దాదాపు లేనట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే మాల్యా భారత్‌లో పలు బ్యాంకులకు రూ.9,400 కోట్ల మేర బకాయి పడ్డారు. దీనిపై ఆయన ఇక్కడ న్యాయ విచారణ ఎదుర్కొంటున్నారు. ఐడీబీఐ నుంచి రూ. 900 కోట్లు తీసుకుని చెల్లించని పక్షంలో మాల్యాకు ఈడీ పలుసార్లు సమన్లు జారీ చేసింది.
అయితే ఆయన కోర్టుకు ఆయన హాజరుకాలేదు. దీంతో ఈడీ విజ్ఞుప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం విజయ్ మాల్యా పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచ వ్యాప్తంగా విజయ్ మాల్యాకు పలు దేశాల్లో ఆస్తులు ఉన్నాయి. ఒక్క లండన్‌లోనే మాల్యాకు 245 బిలియన్ డాలర్ల ఆస్తులున్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications