జగన్ చేతిలో కేజ్రివాల్ భవితవ్యం? రాజ్యసభలో ఈసారి మద్దతివ్వకపోతే!
ఢిల్లీలో ప్రజాసేవలపై అధికారం ఎవరికి ఉండాలనే దానిపై సుప్రీంకోర్టు తాజాగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కంటే కూడా ప్రజలు ఎన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వానికే వీటిపై అధికారం ఉంటుందని తేల్చిసింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకుండా చూసేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. త్వరలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఇది కీలకంగా మారింది.
ఢిల్లీలో సేవలకు సంబంధించి కేంద్రం తీసుకొస్తున్న బిల్లు పార్లమెంటులో ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లుకు రాజ్యసభలో మెజారిటీ లేని కేంద్రం ఇతర మిత్రపక్షాల సాయంతో నెగ్గించుకోవాల్సి ఉంటుంది. గతంలో పలు రాజకీయ అంశాలపై, కేంద్రం విధాన నిర్ణయాలపై రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలిచిన వైసీపీ, బిజూ జనతాదళ్ మరోసారి కీలకంగా మారాయి. రాజ్యసభలో ఈ రెండు పార్టీలకు ఉన్న బలం తోడు లేకపోతే బీజేపీ ఈ బిల్లుపై ముందుకెళ్లే అవకాశం లేదు.

ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న 238 సీట్లలో ఎన్డీయేకు 110 ఉన్నాయి. అలాగే యూపీయేకు 64 మంది ఉన్నారు. ఇతర విపక్షాలకు మరో 64 సీట్ల బలం ఉంది. ఈ ఇతర పక్షాల్లో మమతా బెనర్జీకి 12, ఆప్ కు 10, బీజేడీకి 9, వైసీపీకి 9 సీట్లు ఉన్నాయి.
అలాగే బీఆర్ఎస్ కు 7 సీట్లు, సీపీఎంకు 5 సీట్లు, ఎస్పీకి 3 సీట్లున్నాయి. ఈ ఇతర విపక్షాల్లో టీఎంసీ, ఆప్, బీఆర్ఎస్, సీపీఎం ఎలాగో కేంద్రానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదు. ఇక మిగిలింది వైసీపీ, బీజేడీ మాత్రమే. ఈ రెండు పార్టీలకు కలిపి 18 సీట్లున్నాయి. ఈ 18 ఎన్డీయేకు కలిస్తే ఆ బలం 128కి చేరుతుంది. అప్పుడు ఈ బిల్లు సులువుగా గట్టెక్కుతుంది.
పైకి చూసేందుకు ఇదంతా బాగానే ఉన్నా ప్రస్తుతం ఏపీలో వైసీపీ కేంద్ర సంస్ధల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడిని చూస్తే కేంద్రానికి ఈసారి ఢిల్లీ బిల్లుపై మద్దతిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి నవీన్ పట్నాయక్ బీజేడీ కూడా కేంద్రానికి రాజ్యసభలో మద్దతిస్తుందో లేదో తెలియదు. ఇప్పటికే ఈ రెండు పార్టీలను విపక్షాలు తమ కూటముల్లో చేరాలని ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, బీజేడీలు తీసుకోబోయే నిర్ణయాలు కేజ్రివాల్ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.












Click it and Unblock the Notifications