విభజనపై అన్నీ చెప్పా, నమ్మకం: ప్రణబ్‌తో జగన్ భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని తాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారని, రాష్ట్రపతి సానుకూలంగా ప్రతిస్పందించారని, ఆలోచన చేస్తారనే నమ్మకం ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. ఆయన శనివారం ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాల్సిన అవసరం ఉందని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. 371డి గురించి కూడా తాను ప్రణబ్ ముఖర్జీకి వివరించానని ఆయన చెప్పారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అడ్డగోలుగా ఓట్ల కోసం, సీట్ల రాష్ట్రాన్ని విభజిస్తే, అది ఒక్క ఆంధ్రప్రదేశ్‌తోనే ఆగిపోదని, ఓట్లు రావని భావించిన ప్రతి రాష్ట్రాన్నీ విభజించుకుంటూ పోతారని జగన్ అన్నారు. ఆరవై ఏళ్ల క్రితం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన రాష్ట్రాలను విభజించడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్రాల విభజనకు ఓ పద్ధతిని తీసుకురావాలని తాను రాష్ట్రపతిని కోరానని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాగడానికి కూడా నీరు లభించదని చెప్పినట్లు జగన్ తెలిపారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతికి ఆయన ఐదు పేజీల నివేదిక కూడా అందజేశారు. జగన్ శనివారం సాయంత్రం జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను కలుస్తారు. ఈ నెల 24వ తేదీ ఆదివారంనాడు భవనేశ్వర్ వెళ్లి బిజూ జనతాదళ్ అధినేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకుంటారు.
వైయస్ జగన్ ఇదివరకు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల నాయకులను కూడా కలిసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications