Air India: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. రోజుల తరబడి చిక్కుకుపోయిన ప్రయాణీకులు
Flight delay: రైళ్లు, విమానాలు ఆలస్యం అవడం తరచూ వింటూనే ఉంటాం. గంటల తరబడి ఎక్కాల్సిన ఫ్లైట్ కోసం వేచి చూడటాలు సర్వ సాధారణమే. కానీ గంటలను దాటి రోజల వరకు వెయిట్ చేయాల్సి వస్తే ఆ ప్రయాణం తప్పకుండా నరకమే అవుతుంది. అటువంటి భయానక ఘటన ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ అనుభవిస్తున్నారు.
ఎయిరిండియా విమానంలో న్యూఢిల్లీకి వెళ్లాల్సిన 100 మందికి పైగా ప్రయాణీకులు థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో చిక్కుకుపోయారు. సాంకేతిక లోపం కారణంగా అనేక పర్యాయాలు ఆలస్యం జరిగింది. దీంతో ఏకంగా 80 గంటలకు పైగా ప్యాసింజర్స్ చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఈ మధ్యలో తమ బాధను తెలియజేస్తూ పలువురు ప్రయాణీకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 16వ రాత్రి విమానం ఢిల్లీకి టేకాఫ్ కావాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపం కారణంగా 6 గంటలపాటు ఆలస్యమైందని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఎయిర్‌పోర్టులో గంటల తరబడి నిరీక్షించమన్నారు. అనంతరం విమానం ఎక్కమని చెప్పి మరో గంట తర్వాత దింపేసి, ఆ విమానాన్ని రద్దు చేశారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా కూడా ఓ ప్రకటన చేసింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా నవంబర్ 16న విమానం రద్దు చేయబడిందని వెల్లడించింది. ప్యాసింజర్స్‌కు హోటల్ వసతి మరియు భోజనం సహా అన్ని ఆన్-గ్రౌండ్ సహాయాన్ని అందించి, వారికి అసౌకర్యం కలగకుండా గ్రౌండ్ సిబ్బంది చూసుకున్నారని పేర్కొంది.
వారిలో కొంతమంది అతిథులకు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న ఇతర విమానాలలో కూడా వసతి కల్పించినట్లు ఎయిర్ ఇండియా వివరించింది. టికెట్ రద్దుతో పాటు కాంప్లిమెంటరీ రీషెడ్యూలింగ్‌పై పూర్తి వాపసు కూడా ప్రయాణీకులకు అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకులు మరియు సిబ్బంది భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రయాణికుల్లో వృద్ధులు, చిన్నారులు ఉండటంతో ఎయిర్ ఇండియా మరో విమానాన్ని సిద్ధం చేసినట్లు ప్రయాణీకులు చెబుతున్నారు. లోపాన్ని సరిదిద్దామని చెప్పిన అనంతరం విమానం బయలుదేరినట్లు వెల్లడించారు. అయితే అనూహ్యంగా టేకాఫ్ అయిన రెండున్నర గంటల తర్వాత అది ఫుకెట్‌లో తిరిగి ల్యాండ్ అవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కాగా మరోసారి సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పారన్నారు. ఇక అప్పటి నుంచి తాము ఫుకెట్‌లో చిక్కుకుపోయామంటూ విచారం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్ ప్రతినిధుల నుంచి సంతృప్తికరమైన స్పందన రావడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చాలా మందిని ఇప్పటికే వెనక్కి పంపామని, ఇంకా దాదాపు 40 ఉండగా వారిని సాయంత్రం తిరిగి గమ్యస్థానానికి చేరుస్తామని ఎయిర్‌లైన్ చెబుతోంది.












Click it and Unblock the Notifications