అదానీకి గట్టి ఎదురుదెబ్బ..!
భారత కుబేరుల్లో ఒకరు అదానీ. వ్యాపార రంగంలో ఆయన్ను ఢీకొట్టేందుకు హేమాహేమీలే తలపడుతుంటారు. అంబానీతో పోటీ పడి నికర ఆస్తుల్లో ఆయనే టాప్ ప్లేస్ సంపాదించడం ఈ మధ్యే జరిగింది. అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర దేశాలకు కూడా విస్తరించారు. ఈ క్రమంలోనే అదానీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకీ ఆయనకు షాక్ ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు..?
గౌతం అదానీ.. ఆసియా ఖండంలో ఉన్న అత్యంత సంపన్నుల్లో ఈయన ఒకరు. దేశ విదేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే హిండెన్‌బర్గ్ నివేదికతో ఒక్కసారిగా ఆయనపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.తాజాగా అదానీకి కెన్యా కోర్టు షాకిచ్చింది. కెన్యాలోని జోమో కెన్యాట్ట అంతర్జాతీయ విమానాశ్రయంను తాను నిర్వహించాలని గౌతం అదానీ భావించారు. అయితే కెన్యా హైకోర్టు తీర్పుతో అదానీ ఆశలకు బ్రేకులు పడ్డాయి. ఈ విమానాశ్రయాన్ని టేకోవర్ చేసి తాను నిర్వహించాలన్న యోచనకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ కెన్యా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జోమో కెన్యాట్ట అంతర్జాతీయ విమానాశ్రయంను టేకోవర్ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పటి నుంచే అక్కడి స్థానిక కార్మికులు, ఉద్యోగులు ఇతర ఏవియేషన్ సంఘాలు నిరసన తెలిపాయి. విమానాశ్రయం నిర్వహణ ప్రస్తుత యాజమాన్యం నుంచి అదానీ గ్రూప్‌కు బదిలీ చేయడాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ కెన్యా హైకోర్టు పేర్కొంది. జోమో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 30 ఏళ్లపాటు లీజుకు తీసుకుని దాని నిర్వహణన చేపట్టాలన్న ఆలోచనకు అడ్డుకట్ట వేసినట్లయ్యింది.జోమో కెన్యాట్ట అంతర్జాతీయ విమానాశ్రయం తూర్పు ఆఫ్రికాలోనే అతిపెద్ద ఏవియేషన్ హబ్‌గా గుర్తింపు పొందింది.
జూలై నెలలో కార్మికులు, సిబ్బంది అదానీకి వ్యతిరేకంగా నిరసనలు తారాస్థాయికి చేరడంతో దీన్ని విచారణ చేసిన కెన్యా హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. అదానీ సంస్థ ఈ విమానాశ్రయం నిర్వహణ తీసుకుంటే స్థానికంగా ఉద్యోగాలు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ విదేశీయులు ప్రముఖంగా భారతీయులకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని కార్మికులు ,సిబ్బంది తెలిపారు. గత నెలలో ప్రధాన ఏవియేషన్ సంఘం ఏకంగా స్ట్రైక్‌కు పిలుపునిచ్చింది. అదానీ చేతుల్లోకి విమానాశ్రయం నిర్వహణ వెళితే కెన్యా దేశస్థులకు ఉద్యోగాలుండవని ఆందోళన వ్యక్తం చేశారు.
వారం రోజుల పాటు స్ట్రైక్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి వెంటనే విమానాశ్రయం నిర్వహణకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఏర్పోర్టును అదానీ సంస్థకు అమ్మబోవడం లేదని ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం దీనిపై తీసుకోలేదని దీనిపై ముందుకెళ్లాలా లేదా అనేది ఇంకా ఆలోచిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications