నైజీరియాలో ఉగ్రదాడి : చర్చిలో కాల్పులు - 50 మంది మృతి..!!
నైజీరియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓండోలోని ఓ చర్చిపై ఓ దుండగుడు దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. బాంబులు విసరటం వల్ల పలువురు చిన్నారులు సహా 50 మంది వరకు మరణించినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని..బాంబులు విసిసారని స్థానికులు చెబుతున్నారు. దీంతో..పలువురు చిన్నారులతో సహా 50 మంది మరణించారని స్థానిక నేతలు వెల్లడించారు.
నైజీరియా ఇస్లాం ఉగ్రవాదంతో బాధపడుతుండగా.. దేశంలో శాంతియుత రాష్ట్రంగా ఓండో ప్రసిద్ధి చెందింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిలో పెంతెకోస్ట్ ఆరాధకులు గుమిగూడిన సమయంలో వారిని లక్ష్యంగా చేసుకొని ముష్కరులు ఈ దాడి చేశారని శాసనసభ్యుడు ఒగున్మోలసుయి ఒలువోలే తెలిపారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. చర్చ్ పీఠాధిపతి కూడా అపహరణకు గురయ్యారని నైజీరియా దిగువ శాసన సభ ప్రతినిధి అడెలెగ్బే టిమిలీయిన్ చెప్పారు.

చర్చ్ లో అరాధకులు రక్తపు మడుల్లో పడి ఉండటంతో ప్రజలు విలపించారు.పిశాచాలు మాత్రమే ఇలాంటి దారుణచర్యకు పాల్పడతాయని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి వ్యాఖ్యానించారు. చర్చిపై దాడి వెనుక ఎవరున్నారనే అంశంపైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఓవో చరిత్రలో ఇంత దారుణమైన ఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని శాసనమండలి సభ్యుడు ఓలువోలే అన్నారు. ప్రపంచ దేశాలు ఈ దారుణాన్ని ఖండించాయి. దీనికి సంబంధించి అధికారికంగా ఎంత మంది మరణించారు...ఈ దాడులు చేసిందెవరనే అంశం పైన ప్రకటన చేయనున్నారు.












Click it and Unblock the Notifications